
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది ఉగాది ఉత్సవాన్ని మార్చి 30వ తేదీన బాబా సాహెబ్ అంబేద్కర్ దీక్షాభూమి అయిన నాగ్‌పూర్‌లో జరుపుకున్నారు. నాగ్‌పూర్‌లోని దీక్షాభూమి.. సామాజిక న్యాయానికి, దళితులకు సాధికారత కల్పించడంలో నిరంతరం స్ఫూర్తి కల్పించే కేంద్రం. మనకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి.. పౌరులందరికీ సమానత్వం, గౌరవం కల్పించేందుకు డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషికి భారతీయులు నిరంతరం ఆ మహనీయుడికి రుణపడి ఉంటారు.
రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా భారతావనిని ముందుకు తీసుకెళ్లే విషయంలో మా ప్రభుత్వానికి అంబేద్కర్ చూపిన బాట నిత్యమార్గదర్శనం చేస్తోంది. ఎలాంటి భారతావనిని నిర్మించాలని ఆయన
కలలు కన్నారో.. వాటిని సాకారం చేసే దిశగా మేం అంకితభావంతో పనిచేస్తున్నాం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
గత 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం.. బాబాసాహెబ్‌కు సరైన గౌరవాన్ని అందించడంతోపాటుగా వారుచూపిన బాటలో నడుస్తోంది. వారు సంకల్పించుకున్న లక్ష్యాలను క్షేత్రస్థాయిలో అందించే దిశగా.. ‘నభూతో’ అన్నట్లుగా పనిచేస్తోంది. రాజ్యాంగ నిర్మాత పట్ల మా ప్రభుత్వం నిరంతరం గౌరవాన్ని ప్రదర్శిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ వీలుచిక్కినపుడల్లా తీవ్రమైన విమర్శలతో ఆ మహనీయుడిని అగౌరవపరిచేలా పనిచేస్తోంది. ఇది యావద్భారతావనికి తెలిసిన విషయమే.
నాడు అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వడాన్ని నిరాకరించడం కావొచ్చు, యూపీఏ-2లో పాఠ్యపుస్తకాల నుంచి అంబేద్కర్‌కు సంబంధించిన అంశాలను తొలగించడం ద్వారా అవమానించడం కావొచ్చు, అంబేద్కర్ జీవితానికి సంబంధించిన స్మారకాల అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం కావొచ్చు, నెహ్రూ కేబినెట్ నుంచి అంబేద్కర్‌ను అవమానకర రీతిలో పంపించేయడం కావొచ్చు.. పార్లమెంటు ఎన్నికల్లో బొంబాయి నుంచి పోటీచేస్తున్న అంబేద్కర్‌ను ఓడించేందుకు చేసిన కుట్రలు కావొచ్చు. ఇలా కాంగ్రెస్ ద్వారా అంబేద్కర్‌కు జరిగిన అవమానాల జాబితాలో వందల సందర్భాలుఉన్నాయి.
పంచతీర్థాలతో గౌరవించిన మోదీ
బీజేపీ నాయకుల ద్వారా అంబేద్కర్ గౌరవాన్ని పెంచే చర్యలెన్నో మన కళ్లముందు ఉదాహరణలుగా ఉన్నాయి. 12 ఏప్రిల్ 1990 నాడు.. అటల్ బిహారీ వాజ్‌పేయి చొరవతో పార్లమెంటు సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటుచేశారు. బీజేపీ మద్దతుతో అధికారంలో ఉన్న థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం.. 31 మార్చి 1990 నాడు అంబేద్కర్‌ను భారతరత్నతో గౌరవించుకుంది.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ.. అంబేద్కర్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో ముడిపడిన ‘పంచతీర్థాలు’ను.. జన్మభూమి (మౌ, మధ్యప్రదేశ్), శిక్షాభూమి (లండన్), దీక్షాభూమి (నాగ్‌పూర్, మహారాష్ట్ర), చైత్యభూమి (దాదర్, మహారాష్ట్ర), పరినిర్వాణ భూమి (ఢిల్లీ) ప్రాంతాలను.. చారిత్రక, సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేసింది. యుద్ధప్రాతిపదికన వీటి పనులను ముందుకు తీసుకెళ్లింది.
బాబాసాహెబ్ గౌరవాన్ని మరింతగా పెంచేందుకు, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను రూపుదిద్దడంలో వారి అవిరళమైన కృషికి సరైన గుర్తింపును కల్పించేందుకు సుప్రీంకోర్టులో, న్యాయమంత్రిత్వ శాఖలో అంబేద్కర్‌విగ్రహాలను ఏర్పాటు చేశాం.
ముంబైలో భారీ విగ్రహం
అంబేద్కర్ సంఘర్షణలను, వారి బోధనలను గుర్తుచేసేందుకు.. ముంబైలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ నడిబొడ్డున, అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను ఏర్పాటుచేశాం. ఇవికాకుండా, అంబేద్కర్ ఆలోచనలను మా ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబిస్తూ.. అందరికీ సమానమైన అభివృద్ధి, సంక్షేమ ఫలాలుఅందించడం వరకు ప్రతి విషయంలోనూ అంబేద్కర్ స్వప్నాల సాకారం దిశగా నిర్విరామంగా కృషిచేస్తున్నాం.
అంబేద్కర్ ఆలోచనలే మోదీ నిర్ణయాలు
గత 11 ఏళ్లలో.. మోదీ ప్రభుత్వం ద్వారా రాజ్యాంగంలో తీసుకొచ్చిన సవరణల్లో ఎక్కువ భాగం.. సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించినవే. ఉదాహరణకు 102వ సవరణ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (NCBC)కి రాజ్యాంగ హోదా కల్పించడం, 104వ సవరణ ద్వారా.. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల రిజర్వేషన్‌ను 2030 వరకు కొనసాగించేలా నిర్ణయాలు తీసుకోవడం, 105 సవరణ ద్వారా.. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను ఎంపికజేసే బాధ్యతను పూర్తిగా రాష్ట్రాలకు కట్టబెట్టడం, 106 సవరణ ద్వారా.. మహిళలకు పార్లమెంటు, అసెంబ్లీల్లో 33% రిజర్వేషన్లు కల్పించడం వంటి ఎన్నో అంబేద్కర్ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా.. మోదీ ప్రభుత్వం పనిచేస్తుండటం దేశప్రజలందరికీ తెలిసిందే.
జన్‌ధన్, ముద్ర, పీఎం ఆవాస్, ఉజ్వల, ప్రధానమంత్రి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, 11 కోట్ల టాయిలెట్ల నిర్మాణం, డిజిటల్ ఇండియా, స్టార్టప్, స్వామిత్వ, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కల్యాణ్ అన్నయోజన, సౌభాగ్య యోజన వంటి ఎన్నో పథకాలు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కొత్త శక్తినందిస్తున్నాయనేది జగమెరిగిన సత్యం.
అంబేద్కర్ జయంత్యుత్సవాలు
అంబేద్కర్, భారత రాజ్యాంగం ఈ రెండు ఒకదానికొకటి పూరకాలు. ఇవాళ మనం అంబేద్కర్ జయంత్యుత్సవాలను జరుపుకుంటున్న సమయంలోనే.. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుండటం ఓ చరిత్రాత్మక సందర్భం. ఇలాంటి పవిత్రమైన సందర్భంలో రాజ్యాంగ విలువలపై చర్చించడం బాబాసాహెబ్‌కు మనమిచ్చే ఘనమైన నివాళి అవుతుంది.
అంబేద్కర్ నేతృత్వంలో జరిగిన ఎన్నో చర్చల తర్వాత.. రాజ్యాంగ సభ సభ్యుల మేధోమథనం నుంచి ఉద్భవించిన భారత రాజ్యాంగం.. 75 ఏళ్ల తర్వాత కూడా ఓ సజీవకావ్యంగా మనకు మార్గదర్శనం చేస్తోంది. మన హక్కులను కాపాడుతోంది.
దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..
స్వాతంత్ర్య సముపార్జన తర్వాత భారతదేశం.. శూన్యం నుంచి పని ప్రారంభించలేదు. అంతకుముందునుంచే, సహస్రాబ్దాలుగా ఓ సమృద్ధమైన దేశంగా ఉంది, విజ్ఞాన భాండాగారంగా ప్రపంచానికి మార్గదర్శనం చేసింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఘనమైన చరిత్రకు రాజ్యాంగ స్ఫూర్తిని సమ్మిళితం చేసి ముందుకెళ్లినపుడే.. మరోసారి దేశాన్ని విశ్వగురువుగా నిలపడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలవడం సాధ్యం.
ఇదే మోదీ ప్రభుత్వపు అభివృద్ధి మంత్రం. అందుకే గత 11 ఏళ్లలో.. ఓ క్రమశిక్షణతో కూడిన పాలనను అందిస్తూ.. భారతదేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపిన ఘనత మోదీ సర్కారుదే.
రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తితో..
ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ‘భారతదేశ రాజ్యాంగానికి 75 ఏళ్లు, గౌరవోపేతమైన ప్రయాణం’ పేరుతో చర్చ జరిగింది. వివిధ అంశాలపై విస్తృతమైన చర్చ ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘ఈ 75 ఏళ్ల ప్రయాణం ఓ
సాధారణమైన విషయం కాదు. ఇదో అసాధారణమైన ప్రగతి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మన అస్తిత్వంపై ప్రపంచదేశాలన్నీ ఎన్నో సందేహాలు లేవనెత్తాయి.
కానీ, 75 ఏళ్ల ప్రయాణంలో వాటినన్నింటినీ పటాపంచలు చేస్తూ.. భారత రాజ్యాంగ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందుకుగాను.. భారత రాజ్యాంగ నిర్మాతకు, నాటి రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ.. రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న కోట్లాదిమంది భారతీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అని అన్నారు.
25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి
‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ అనేవి అంబేద్కర్ ఆలోచనకు ప్రతిరూపం. దీన్ని మోదీ ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్, సబ్‌కా విశ్వాస్’ నినాదంతో ముందుకు తీసుకెళ్తూ.. గత 11 ఏళ్లుగా దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కంకణబద్ధమై పనిచేస్తోంది. దీని ఫలితంగానే.. 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారు.
సామాజిక న్యాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ అన్నివర్గాలకు సంపూర్ణ సాధికారత కల్పించే దిశగా మోదీ సర్కారు కృషిచేస్తోంది. నాడు అంబేద్కర్ కన్న కలలను.. నేడు మోదీ సర్కారు సాకారం చేస్తోంది. సంకల్పిత లక్ష్యాల సాధనలో వేగంగా ముందుకెళ్తోంది. ఇదే బాబాసాహెబ్ స్మృతికి మోదీ సర్కారు అందిస్తున్న నివాళి.
- జి.కిషన్ రెడ్డి,
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి