
- అనర్హత వేటు పడ్తదనే అసెంబ్లీకి కేసీఆర్: మంత్రి కోమటిరెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ ఇక ఉండదని, బ్రహ్మదేవుడు వచ్చినా ఆ పార్టీని కాపాడలేరని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అనర్హత వేటు పడుతుందనే కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రావాలనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తా అని కేసీఆర్ అంటున్నడు. ఒకవేళ కేసీఆర్ ఒక అంశాన్ని ఎత్తిచూపితే.. పది అంశాలను సభ ముందు పెడ్తం. దళిత సీఎం నుంచి జర్నలిస్ట్ లకు చేసిన మోసం వరకు అన్ని ఎండగడ్తం. 2014లో దళిత సీఎం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిండు. 2018 ఎన్నికలకు రెండు రోజుల ముందు రైతు బంధు వేసి రెండోసారి సీఎం అయిండు. అంతేకానీ, ప్రజలకు మంచి చేసి కాదు.
కేసీఆర్ వి దొంగ దీక్షలు. మెదక్ జిల్లా తూప్రాన్ లో స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగి పిల్లలు చనిపోతే సీఎం హోదాలో కేసీఆర్ కనీసం చూడలేదు. కొండగట్టు వద్ద బస్సు యాక్సిడెంట్ జరిగి ప్రజలు చనిపోతే వెళ్లలేదు. కానీ ఆయన ఇంట్లో కుక్క చనిపోతే మాత్రం డాక్టర్‌ను సస్పెండ్ చేసిండు. ఇది గత బీఆర్ఎస్ పాలన” అని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిట్ చాట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు బీజేపీ కోసం ప్రచారం చేశారని.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిని నిలబెట్టకుండా పరోక్షంగా బీజేపీకి మేలుచేశారని ఆయన దుయ్యబట్టారు.
పదేండ్లు రేవంతే సీఎం
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో గొడవ జరిగినట్లు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని మంత్రి కోమటిరెడ్డి ఖండించారు. కేబినెట్ లో ఇలాంటి వాటికి చోటు ఉండదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల మేలు కోరే అంశాలపై మంచి వాతావరణంలో భేటీ జరిగిందని చెప్పారు. రాబోయే పదేండ్లు రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని పేర్కొన్నారు. బీసీ కుల గణనపై మాట్లాడే హక్కు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు లేదన్నారు. వాళ్లు అసలు కులగణనలోనే పాల్గొనలేదని ఆయన మండిపడ్డారు.