- 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నరు: మంత్రి వెంకట్ రెడ్డి
- త్వరలోనే వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరుతరు
- ఫామ్ హౌస్‌లో జరిగింది రావుల పార్టీనో.. రేవ్ పార్టీనో తేల్తదని కామెంట్
హైదరాబాద్, వెలుగు : జూబ్లీహిల్స్‌లోని టానిక్ షాపు కేటీఆర్‌దే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆ షాపుతో భారీగా లిక్కర్ అమ్ముకున్నారని, దానికి బినామీ ఆయనే అని అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తప్పు చేసినోళ్లు కచ్చితంగా జైలుకు పోతరు.. రేపో.. మాపో.. అరెస్ట్‌లు ఉంటయ్. బామ్మర్దిని కేటీఆర్ దాచిపెట్టుడు ఏంది? తప్పు చేయకపోతే పారిపోతారా? రేవ్ పార్టీ కాకపోతే కోర్టుకు ఎందుకెళ్లిండు? అది రావుల పార్టీనో.. రేవ్ పార్టీనో.. తేలుతది. బీఆర్ఎస్కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నరు. వాళ్లంతా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతరు. మేము కరెంట్ చార్జీలు పెంచుతామని అననే లేదు.. బీఆర్ఎస్ లీడర్లేమో గెలిచినట్లు సంబరాలు చేసుకుంటున్నరు. అందరూ కలిసి క్యాసినో ఆడుకోండి’’అని మంత్రి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కులగణన నిర్ణయం చారిత్రాత్మకం
కుల గణన చేయాలని తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మతకమైందని మంత్రి వెంకట్ రెడ్డి అన్నారు. ‘‘మేము ఏ ప్రోగ్రామ్ చేసినా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నయ్. కుల గణనతో 50% పైబడిన బీసీ వర్గాలకు మేలు జరుగుతది. పార్టీలకు అతీతంగా అందరూ ఇందులో పాల్గొని సహకరించాలి. వెనుకబడిన కులాల మీద బీఆర్ఎస్ కు ఏ మాత్రం ప్రేమ లేదు. కుల గణనకు సహకరించాలని ఫ్లోర్ లీడర్‌గా కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. లేదంటే తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు అవుతది’’అని మంత్రి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.