- ఆయన తర్వాత అంత గొప్ప ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్
- ఇంజినీర్స్ డే వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: భాగ్యనగరాన్ని దివంగత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాపాడారని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. వరదల నుంచి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినందుకు విశ్వేశ్వరయ్యకు గొప్పపేరు వచ్చిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత అంత గర్వంగా చెప్పుకోదగ్గ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అని మంత్రి తెలిపారు. గురువారం నవాబ్ అలీ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన ఇంజినీర్స్ డే వేడుకల్లో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టే మహానుభావుల గుర్తింపులోనూ అన్యాయం జరిగిందని, అందుకు ఉదహరణే నవాజ్ జంగ్ అని చెప్పారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి రోజును ఇంజినీర్స్ డేగా అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. నవాజ్ జంగ్ మొట్టమొదటి స్వదేశీ చీఫ్ ఇంజనీర్ గా రికార్డు సృష్టించారని గుర్తుచేశారు. ఇక ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ కు 2 వేల గజాల భూమి అడిగారని, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి జాగా ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో రిటైర్డ్ ఇంజినీర్ల సలహాలు, సూచనలు తీసుకుంటామని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోదని, టీం వర్క్ గా అందరూ చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
నమామి గంగా పేరుతో సబర్మతి నదిని ప్రధాని నరేంద్ర మోదీ క్లీన్ చేస్తుంటే గత ప్రభుత్వం మూసీని శుద్ధి చేయలేదని, కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లకుండా వారికి కావల్సిన ప్రాజెక్టులు నిర్మించి దోచుకున్నారని మంత్రి మండిపడ్డారు. టెక్నాలజీ లేని రోజుల్లోనే 58 టీఎంసీల సామర్థ్యంతో నిజాంసాగర్ ప్రాజెక్టును నవాబ్ అలీ జంగ్ నిర్మిస్తే ఇప్పటికీ చెక్కు చెదరలేదని మంత్రి గుర్తుచేశారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఇంజినీర్లను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ మాజీ వీసీ డీఎన్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, నిట్ వరంగల్ పీజీ శాస్ర్తితో పాటు పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.