- కాంగ్రెస్ గృహజ్యోతి ఫేమస్.. కేసీఆర్ 24 గంటల కరెంట్ బోగస్
- ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : కాంగ్రెస్ అందిస్తున్న ఉచిత కరెంట్‌ను ప్రతిపక్ష పార్టీల నేతలు జీర్ణించుకోవడం లేదని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని మాన్యం చెల్క, హైదర్ ఖాన్ గూడా, రహమత్ నగర్‌తో పాటు తిప్పర్తి, కనగల్ మండలాల్లో గృహజ్యోతి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. లబ్ధిదారులైన వి. కోటమ్మ, షబానాలను ఇంతకు ముందు కరెంటు బిల్లు ఎంత వచ్చేదని మంత్రి అడగగా.. గతంలో తాము రూ. 700 నుంచి రూ. 1000 దాక బిల్లులు చెల్లించేవాళ్లమని ఇప్పుడు జీరో బిల్లుతో సంతోషంగా ఉందన్నారు.
కనగల్‌లో జరిగిన సమావేశంలో.. ‘మీరు పండగలకు, పెండ్లిళ్లకు పోయినప్పుడు బస్సుల్లో టికెట్ తీసుకుంటున్నారా..?’ అని మహిళల్ని అడగగా.. లేదని వారు బదులిచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ గృహజ్యోతి ఫేమస్ అని, కేసీఆర్ 24 గంటల కరెంట్ బోగస్ అని విమర్శించారు. గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క ఇంటిని కూడా నిర్మించి పేదలకు పంచలేదని, ఒక్క రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, మార్చి 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పారు.
సొంత స్థలం ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇస్తామని, ఇంటి స్థలం లేని వారికి డబ్బులతో పాటు స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో మూడు వేల నుంచి ఐదువేల ఇండ్లను నిర్మిస్తామని మాటిచ్చారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే 25 వేల మందికి ఉద్యోగాలిచ్చామని, గ్రూప్-1 నోటిఫికేషన్ , మెగా డీఎస్సీని ప్రకటించామని పేర్కొన్నారు. రెండేండ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నల్గొండ జిల్లాకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
ఎస్ఎల్బీసీతో పాటు ఏఎమ్మార్పీ కాల్వల నిర్మాణానికి నిధులను కూడా విడుదల చేయించామని, త్వరలోనే పనులు స్పీడప్ చేస్తామన్నారు. మూడు నెలల్లో నల్గొండలోని మాన్యం చెల్కలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు కొత్త భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు నల్గొండలోని ఆర్య సమాజ్ ఆవరణలో నల్గొండ జిల్లా ఆర్య సమాజ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంత్రిని సమాజ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి
5 ఏండ్ల లోపు పిల్లలకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో కలెక్టర్ హరించదనతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు పోలియో వ్యాధి బారినపడితే అంగవైకల్యం సంభవిస్తుందని, అలా జరగకుండా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,61,925 మంది చిన్నారులను గుర్తించి 981 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామమన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలు, ఫ్యాక్టరీలు, రైల్వే స్టేషన్లు,బస్టాండ్ల వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని అధికారులను అదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ అన్నిమళ్ల కొండల్రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో వేణుగోపాల్ రెడ్డి ,జిల్లా ఇమ్యునైజెషన్ అధికారి డాక్టర్ జమీర్, జీపీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ నిత్యానంద, ఎంసీహెచ్ పీవో డాక్టర్ అరుంధతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.