- డిప్యూటీ ఫ్లోర్ లీడర్వా? లేక ఎమ్మెల్యేవా?
- ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నరు?
- మూసీ నీళ్లు తాగి నల్గొండ ప్రజలు సచ్చిపోతున్నరు
- పదేండ్లు అధికారంలో ఉండి మీరేం చేయలేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: హరీశ్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడరా? లేక ఎమ్మెల్యేనా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. ఏ హోదాలో మాట్లాడుతున్నారో క్లారిటీ కావాలని హరీశ్ రావును నిలదీశారు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రావడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. హరీశ్ రావుకు ప్రశ్నించే హక్కు లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. గురువారం ఉదయం స్పీకర్ ప్రసాద్.. తొలుత ప్రశ్నోత్తరాలపై మాట్లాడేందుకు సభ్యులకు టైమ్ ఇచ్చారు.
ఈ క్రమంలో ఇరిగేషన్‌కు సంబంధించిన అంశంపై వెంకట్రెడ్డి మాట్లాడుతుండగా.. మధ్యలో హరీశ్ కలుగజేసుకోవడంతో వాగ్వాదం జరిగింది. వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నల్గొండ వాసులు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నరు. ఓ వైపు ఫ్లోరైడ్.. మరోవైపు మూసీ మురుగునీరు తాగి సచ్చిపోతున్నరు. గత సర్కార్ పదేండ్లలో రూ.7లక్షల కోట్ల అప్పులు చేసినా.. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయలేదు.
మా ప్రభుత్వం గంధమల్ల రిజర్వాయర్ పనులను కంప్లీట్ చేస్తున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 40 లక్షల మంది జీవితాలను సీఎం, మంత్రులంతా కలిసి కాపాడాలి’’అని మంత్రి కోరారు. ఎమ్మెల్యే హరీశ్ కలుగజేసుకుని.. ‘‘కేబినెట్ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయం. క్వొశ్చన్ అవర్లో ఓ మంత్రి మరో మంత్రిని ప్రశ్నలు అడగడం ఏంటి? కాంగ్రెస్ హయాంలో వెంకట్రెడ్డి మంత్రిగా ఉన్నరు. వారి హయాంలో మూసీపై అప్పుడు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నల్గొండ ప్రజల కష్టాలకు ప్రధాన ముద్దాయి కాంగ్రెస్సే’’అని హరీశ్ ఫైర్ అయ్యారు.
ఏడాదిగా కేసీఆర్ సభకు రావట్లే
హరీశ్ కలుగజేసుకోవడంపై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘హరీశ్ రావు.. నువ్వు ఏ హోదాలో మాట్లాడుతున్నవ్? డిప్యూటీ ఫ్లోర్ లీడర్వా? లేక ఎమ్మెల్యేనా? అసలు నీ హోదా ఏంటి? నీకు ప్రశ్నించే హక్కు లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఏడాదిగా సభకు రావట్లేదు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమే.
ఎస్ఎల్బీసీ టన్నెల్ కంప్లీట్ చేయాలని మీ ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా.. కనికరించలే. గతంలో మేమే 70% పనులు కంప్లీట్ చేసినం. నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా సొరంగం వద్దకు పోలే. నీకు నల్గొండ గురించి మాట్లాడే హక్కు లేదు’’అని వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.
బోర్ వేస్తే పసుపు పచ్చ నీళ్లే వస్తున్నయ్
తమ వద్ద ఎక్కడ బోర్ వేసినా పసుపు పచ్చ నీళ్లే వస్తున్నాయని మంత్రి వెంకట్ రెడ్డి అన్నారు. ‘‘పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు నల్గొండతో పాటు భువనగిరికి ఎంతో ఉపయోగకరం. 2004లో రూ.1.60 లక్షలతో చిన్నగా స్టార్ట్ చేసినం. ఇప్పటిదాకా రూ.26 కోట్లు మంజూరు చేయించిన. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలోపే ప్రభుత్వం మారిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ పనులు పక్కనపెట్టింది’’అని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు.