- రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని పిచ్చిగా మాట్లాడుతుండు
మిర్యాలగూడ, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మతి భ్రమించిందని, అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి గాంధీ భవన్‌కు పంపిస్తానంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. బుధవారం మిర్యాలగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 9 చోట్ల బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పడిపోయిందని, ఏడు స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని, ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్‌లో మార్పు రాలేదన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా సంపాదన మీదే దృష్టి పెట్టారని, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రూ.వేల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్‌ను ఎవరైనా కలవాలంటే ఐదేండ్లు పట్టేదని, సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా ఎవరైనా కలవచ్చని చెప్పారు. నల్గొండలో బీఆర్‌ఎస్ ఆఫీసు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. జమిలి ఎన్నికలపై జాతీయ నాయకులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్రంలో అవసరమైన రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జై వీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్, చిరుమర్రి కృష్ణయ్య, తమ్మడ బోయిన అర్జున్, పొదిళ్ల శ్రీనివాస్, నూకల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.