- పార్టీలో బావ, బామ్మర్దులే మిగిలిన్రు: మంత్రి వెంకట్‌రెడ్డి
- ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదు
- 10 రోజుల్లో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ నింపుతామని వెల్లడి
నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని, ఆ పార్టీలో బావ, బామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ మాత్రమే మిగిలారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల ఉసురు తగిలి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని విమర్శించారు. ఎవరు అడ్డుపడినా.. మూసీ ప్రక్షాళన మాత్రం ఆగదని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ఖాజీరామారాంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు.
ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించి.. ఎల్లమ్మగుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి లేదు. మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాలు అనవసరంగా అడ్డుపడ్తున్నాయి. రాబోయే 10 రోజుల్లో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులో నీళ్లు నింపుతాం. చెరువులు నింపేందుకు కాల్వల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించా.
.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేపట్టలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేశాం. రెండేండ్లలో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
రూ.2లక్షల పైన రుణాలు మాఫీ చేస్తం
సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న రూ.2లక్షలకు పైగా ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తామని మంత్రి మటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ‘‘ఖాజీరామారం గ్రామానికి 50 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నం. మాడుగులపల్లి మండల కేంద్రంలో కోటి రూపాయలతో ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్, ఎంపీడీవో ఆఫీసులు నిర్మిస్తున్నం. అన్ని హంగులతో ల్యాండ్ స్కేప్, గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నం’’అని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఇన్చార్జ్ ఆర్డీవో శ్రీదేవి, డీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు.