మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమిదే విజయం :మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

  • ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ బాగుంది: మంత్రి వెంకట్​ రెడ్డి
  • రెండు రోజులుగా షోలాపూర్​లో మంత్రి ప్రచారం
  • మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండేతో భేటీ

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమే విజయం సాధిస్తుందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల మహా ప్రజల్లో ఆదరణ బాగుందని, ప్రచారంలో పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, షోలాపూర్ ఎంపీ ప్రణతి షిండేతో కలిసి తెలుగు ప్రజలు ఎక్కువ ఉండే షోలాపూర్ లో జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డితో కలిసి  రెండు రోజుల  నుంచి మంత్రి వెంకట్​రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండేతో మంత్రి భేటీ అయ్యారు.

ప్రచార శైలి, ప్రజల నుంచి వస్తున్న ఆదరణను షిండేకు వివరించారు. తెలంగాణకు చెందిన అనేక జిల్లాల నుంచి వచ్చిన చేనేత, యాదవ, కురుమ సోదరులు కాలనీలు ఏర్పాటు చేసుకున్నారని.. అక్కడికి వెళ్లగానే వారు అపూర్వంగా స్వాగతం పలికిన తీరు సంతోషం కలిగించిందని ఈ సందర్భంగా మంత్రి వెంకట్​రెడ్డి షిండేకు వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నట్టు షిండే దృష్టికి తీసుకెళ్లారు.

కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి పట్టంకట్టే పార్టీ అని.. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేది ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులేనని ప్రజలకు వివరించినట్టు  మంత్రి చెప్పారు. ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే కాంగ్రెస్ కూటమి గెలవబోతోందనేది స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు.  తెలంగాణకు షోలాపూర్ కు విడదీయలేని బంధం ఉందని, అత్యధిక జనాభా తెలంగాణ ప్రాంతానికి చెందినవారేనని సుషీల్ కుమార్ షిండే ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమావ్యక్తం చేశారు.  పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఈ సందర్భంగా సుశీల్ కుమార్ షిండే అభినందించారు.