నేను అడిగినందువల్లే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై న్యాయ విచారణ: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ, వెలుగు: యాదాద్రి థర్మల్​ పవర్​ ప్లాంట్​ గురించి అసెంబ్లీలో తాను ప్రస్తావించడంతోనే ప్రభుత్వం సిట్టింగ్​ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఇన్​చార్జి మంత్రిగా ఉన్న ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాను కూడా అందరూ ఆశ్చర్యపడేలా అభివృద్ధి చేస్తానని, దాంతోపాటు  గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీదా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నల్గొండ జిల్లాలో పెండింగ్​ ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఎంజీ యూనివర్సిటీ లో హాస్టల్​ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు, నల్గొండ, నల్గొండ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలకు రూ.100 కోట్ల పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వంద రోజుల్లో అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.