ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

నార్కెట్ పల్లి, వెలుగు : ఆగస్టు 15లోపు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్-– విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్స్ స్పాట్లు గుర్తించామని, అక్కడ రూ.325 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. డిసెంబర్ లోపు పనులు పూర్తి చేస్తామన్నారు.

ప్రజలంటే తనకు ప్రాణమని, జీవితం ప్రజలకే అంకితమని అన్నారు. నల్గొండ జిల్లాకు రూ.500 కోట్లతో ఆర్ అండ్ బీ రహదారులు తెచ్చామని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదలకు ఇండ్లతోపాటు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. నకిరేకల్, నల్గొండ నాకు రెండు కళ్ల లాంటివని అన్నారు. వారం రోజుల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. సొంత స్థలం ఉంటే తక్షణమే ఇల్లు నిర్మిస్తామని, లేనివారికి ప్రభుత్వ స్థలం ఉన్నచోట ఇల్లు కట్టిస్తామని తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును రూ.400 కోట్లతో మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.

నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్ బీసీ ఇతర ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి రూ.2,200 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. చిట్యాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు లక్ష్మీనరసింహ, మాజీ మార్కెట్ చైర్మన్ కాటం వెంకన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు.