నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో టాస్క్, టీఎఫ్ఎంసీ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను ఏడాదిలోపే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగం పెరిగిపోతున్న తరుణంలో నల్గొండలో సుమారు 13 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేలా 127 కంపెనీలను తీసుకురావడం జరిగిందన్నారు. ఏడాదికి కనీస వేతనం రూ.లక్ష మొదలుకొని రూ.12 లక్షల వరకు జీతం ఇచ్చేలా కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు.
ప్రతీక్ ఫౌండేషన్, సుభద్ర ఫౌండేషన్ల ద్వారా గతంలో జిల్లాలో 18,410 మందికి ఉద్యోగావకాశాలు కల్పించి, రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వేతనాలు ఇప్పించామని, జేఎన్టీయూలో జాబ్ మేళా నిర్వహించి 10వేల మందికి ఉద్యోగాలిచ్చినట్టు చెప్పారు. ఇకపై ప్రతినెల ఒక జాబ్ మేళా నిర్వహిస్తామని, వచ్చే నెల ఎన్జీ కాలేజీలో ఉంటుందన్నారు. యువత ఎంప్లాయ్ గానే కాకుండా ఎంప్లాయ్ క్రియేటర్ గా ఎదగాలన్నారు. తన కూతురు కూడా జాబ్ సంపాదించుకున్న తర్వాత మరో 150 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగిందని, మీరంతా కూడా అదే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా వివిధ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఖాళీల భర్తీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో భర్తీ చేస్తామన్నారు. జాబ్ మేళాను నిర్వహించడానికి కలెక్టర్ హరిచందన ఎంతో చొరవ తీసుకున్నారన్నారు. ఉద్యోగాల కోసం ప్రిపరయ్యే నిరుద్యోగులకు ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మెటీరియల్ పంపిణీ చేస్తామన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్ రెడ్డి, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, టీఎఫ్ఎంసీ సీఈఓ సత్యనారాయణ, ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డి, జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రిశ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్ పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ బ్రాంచ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ , ఆంపి థియేటర్, ఇంజినీరింగ్, టెక్నాలజీ కొత్త బిల్డింగులను ప్రారంభించారు. యూనివర్సిటీలో ఇతర భవనాల కోసం రూ. 100 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే వీటి పనులు చేపడతామన్నారు. ఎస్పీ చందన దీప్తి, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా పాల్గొన్నారు.