- సంక్రాంతి నుంచి రైతు భరోసా
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ, వెలుగు : ధరణి కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకే భూమాతను తీసుకొస్తున్నామని, జనవరి 2 నుంచి భూభారతి పేరుతో భూధార్ కార్టులు ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రకటించారు. నల్గొండ కలెక్టరేట్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఇందిరా స్వశక్తి మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు రూ. లక్ష కోట్లు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో మళ్లీ వీఆర్‌వో వ్యవస్థను తీసుకొస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాములలో మహిళా సంఘాల సభ్యులతో పైలెట్ ప్రాజెక్ట్ కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళలు ప్రతి నెల రూ. 3 నుంచి రూ. 4 వేలు అదనపు ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం కాల్వలను మార్చిలోపు పూర్తిచేసి చెరువులన్నింటినీ నీటితో నింపి మొదటి దశలో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. కెనాల్ పనులకు సంబంధించిన భూసేకరణ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ. 37 కోట్లు మంజూరు చేసిందని, వారం రోజుల్లో మరో రూ.35 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు.