- ఇప్పటికే రూ. 100 కోట్లు మంజూరు
- రూ. 33.50 కోట్లతో మల్టీ పర్పస్ స్టేడియం
- బ్రిడ్జిలు, రోడ్ల కోసం రూ. 120 కోట్లు
- ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పుపై రీ సర్వే
యాదాద్రి, వెలుగు: భువనగిరి ఖిల్లాను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని, కేంద్రం నుంచి ఇప్పటికే రూ.100 కోట్లు రిలీజ్ అయ్యాయని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ఖిల్లా రోప్ వేకు సంబంధించి రెండు మాసాల్లో టెండర్ పూర్తి చేసుకొని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆదివారం యాదాద్రి కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో పలు అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్ మార్పుపై మరోసారి సర్వే నిర్వహించాలని సూచించారు. మల్టీపర్పస్ స్టేడియాన్ని రూ. 33. 50 కోట్లతో నిర్మించనున్నామని, ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను నాలుగు రోజుల్లో అందించాలని ఆదేశించారు. బస్వాపురం రిజర్వాయర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో 18 ఏండ్లు దాటిని వారిని చేర్చాలని సూచించారు. సౌత్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా భువనగిరిలో మోడల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని, రెండు నెలల్లో టెండర్ పనులు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఎయిమ్స్‌లో వసతులు పెంపు
ఎయిమ్స్‌లో వసతులు పెంచడంలో భాగంగా రెండు టవర్స్ నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. ధర్మారెడ్డికాలువ, బునాదిగాని కాలువ, బస్వాపూర్ బాధిత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చారు. దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడి యాదగిరిగుట్టలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతుల కల్పిస్తామని, టెంపుల్ అభివృద్ధి కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొలనుపాకలో రూ. 15 కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో బ్రిడ్జితో పాటు జైన దేవాలయం దాటే వరకు రోడ్డు విస్తరించి, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బ్రిడ్జి పనులకు ఈనెల 24న శంకుస్థాపన చేస్తామని చెప్పారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో బ్రిడ్జి నిర్మాణాలకు రూ. 60 కోట్ల చొప్పున కేటాయించామని వెల్లడించారు. రుద్రవెల్లి , సంగెం బ్రిడ్జిలు, బొల్లెపల్లి, అనాజీపురం రోడ్లు శాంక్షన్ అయ్యాయని, భువనగిరి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతామని వివరించారు.
త్వరలోనే గ్రామానికి 100 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి.. లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తామని మాటిచారు. రివ్యూ మీటింగ్‌లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు జెండగే, అడిషనల్ కలెక్టర్లు జీ వీరారెడ్డి, ఏ భాస్కర్‌రావు, అడిషనల్ డీసీపీ శివరాం రెడ్డి, ఆర్డీవో అమరేందర్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.