నేషనల్ హైవేస్ వర్క్స్ స్పీడప్ చేయండి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

  • ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • ప్రతివారం పనుల ప్రోగ్రెస్​పై నివేదిక ఇవ్వాలి
  • ఎన్​హెచ్​ఏఐ అధికారులకు మంత్రి ఆదేశాలు
  • పెండింగ్​ పనులపై మినిస్టర్ క్వార్టర్స్​లో రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవేస్ పనులను స్పీడప్ చేయాలని సంబంధిత ఆఫీసర్లను ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆదేశించారు. నిర్మాణం, భూసేకరణలో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఎన్​హెచ్​ఏఐ రీజనల్ ఆఫీసర్ శివశంకర్, ప్రాజెక్టు ఆఫీసర్ నాగేశ్వరరావుతో కలిసి మంత్రి రివ్యూ చేశారు. అధికారులు గతాన్ని పక్కనపెట్టి జాతీయ రహదారుల నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని ఆదేశించారు. విజయవాడ,- నాగ్ పూర్ సెక్షన్ (ఎన్ హెచ్163జీ)కు సంబంధించి మేఘా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి.. భూసేకరణకు ఇబ్బందులు లేనిచోట, ఇప్పటికే భూసేకరణ చేసిన ప్రాంతాల్లో పనులను మొదలు పెట్టాలని చెప్పారు. 

హైదరాబాద్ – డిండి (ఎన్ హెచ్ 765) కి సంబంధించి 2 వరుసల నుంచి 4 వరుసలకు అప్ గ్రేడ్ చేయడంపై ఒకట్రెండు రోజుల్లో సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి అలైన్ మెంట్ ను ఫైనల్ చేస్తామని.. వెంటనే డీపీఆర్ సిద్ధం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఖమ్మం – దేవరపల్లి (ఎన్ హెచ్365జీజీ) గ్రీన్ ఫీల్డ్ రహదారి పనుల్లో నాణ్యతాప్రమాణాలను రోజూ పరీక్షించాలని.. నాణ్యతాలోపం ఉంటే సంబంధిత సంస్థపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూల్ – రాయచూర్ (ఎన్ హెచ్-150సీ) గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులను వేగవంతం చేసి సకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 2 వరుసల నుంచి 4 వరుసలుగా అప్ గ్రేడ్ చేస్తున్న హైదరాబాద్,- మన్నెగూడ జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. పనులను మరింత స్పీడప్ చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

 హైదరాబాద్ – నాగ్ పూర్ (ఎన్ హెచ్ 44) హైవే పనుల పురోగతిపై ఆరా తీసిన మంత్రి.. 17 కి.మీ., 10 కి.మీ.ల రెండు ప్యాకేజీలు.. హైదరాబాద్, బెంగళూరు (ఎన్ హెచ్ 44)  జాతీయ రహదారి పరిధిలో 12 కి.మీ.ల  మూడో ప్యాకేజీ పనులు ఎక్కడి వరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. అయితే, రోడ్ వైడెనింగ్, ఫ్లైఓవర్ల నిర్మాణాల్లో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో వెంటనే మంత్రి.. రంగారెడ్డి కలెక్టర్ తో మాట్లాడి భూసేకరణకు ఉన్న అడ్డంకులపై చర్చించి.. సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. హైదరాబాద్ – విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారి పనులనూ వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతివారం నేషనల్ హైవేస్ నిర్మాణ పనుల ప్రోగ్రెస్ పై  నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.