విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 
  •     ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

తుంగతుర్తి/ శాలిగౌరారం(నకిరేకల్ )వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యనందిస్తామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, ప్రతి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తామని తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం రూ.22 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్​పాలనలో రాష్ట్రంలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని గుర్తుచేశారు. రూ.600 కోట్లతో ప్రభుత్వ పాఠశాలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామన్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యనందించి బంగారు భవిష్యత్ కల్పిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గాలవారీగా అర్హులకు గుర్తించి పంపిణీ చేస్తామన్నారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్​, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్​ అందజేశారు.

కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్​రావు, అడిషనల్ కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, పీడీ మధుసూదనరాజు, డీఈవో అశోక్, డీపీవో సురేశ్ కుమార్, ఆర్ అండ్ బీ ఈఈ  భాస్కర్ రావు, డీడబ్ల్యూవో వెంకటరమణ, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ దామోదర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత, నాయకులు పాల్గొన్నారు.   

భావన భవిష్యత్​కు అన్ని విధాలా సహకరిస్తాం..

నార్కట్​పల్లి, వెలుగు : నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని సుంకేనపల్లి  గ్రామానికి చెందిన యాకరి భావన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్ ప్రొఫెసర్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీలో  గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ని ఐఐఎం కాశీపూర్ లో ఎంబీఏ ఎనలిటిక్స్ లో ప్రవేశం సాధించింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆమెను అభినందించి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. భావన భవిష్యత్​కు అన్ని విధాలా సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.