అవాస్తవాలతో బద్నాం చేస్తున్నరు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అవాస్తవాలతో బద్నాం చేస్తున్నరు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • హెలికాప్టర్ కోసం నేను పట్టుపట్టినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు: మంత్రి వెంకట్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వంపై, మంత్రులపై ఒకట్రెండు మీడియా సంస్థలు పనిగట్టుకొని తప్పుడు వార్తలు పబ్లిష్ చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికలు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమాచార వారధులుగా ఉండాలి తప్పితే.. ప్రజల్లో అపోహలు కల్పించేలా.. కొన్ని పార్టీలను సంతృప్తిపరిచేలా వార్తలు రాయడం బాధాకరమని గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక పత్రికలో తాను హెలికాప్టర్ అడిగినట్టు.. అధికారులు వద్దన్నట్టు అసలు జరగని ఘటనను వార్త రాసి అదొక పార్టీ కరపత్రిక అని చెప్పకనే చెప్పిందన్నారు. 

‘‘సదరు పత్రిక వంతపాడుతున్న పార్టీ మీద ఎవరైనా విమర్శలు చేస్తే, ఆ పార్టీ నాయకులు ప్రజలకు చేసిన ద్రోహన్ని బయటపెడితే.. ఈ పత్రిక తననే తిట్టినట్టు భావిస్తూ భరించలేని వేదనతో ప్రభుత్వంపై అసత్యాలు, అర్ధసత్యాలు రాస్తూ రాక్షసానందం పొందుతున్నది” అని అన్నారు. సీఎంకు మంత్రివర్గ సహచరులకు మధ్య లేని దూరాన్ని పెంచాలని ఆ పత్రిక చేస్తున్న వెకిలి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో హెలికాప్టర్​ను దుర్వినియోగం చేసిన విషయం కూడా రాయాలన్నారు. ఆ పత్రిక వంతపాడుతున్న పార్టీ అధినేత ఇంట్లో నంబర్​2 స్థానం కోసం జరుగుతున్న రాజకీయం గురించి వార్తలు రాస్తే బావుంటుందన్నారు. నెలలుగా ఫామ్​హౌస్ దాటని ప్రతిపక్ష నేతను ప్రశ్నించాలని సూచించారు.