ఆపదలో అండగా నిలుస్తా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

నల్గొండ అర్బన్​, వెలుగు : ఆపదలో ఉన్నవారు.. తన తలుపు తడితే చాలు వారికి అండగా నిలబడతానని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలోని క్యాంపు ఆఫీస్ సమీపంలోని మున్సిపల్​పార్కులో ప్రజాదర్బార్ ​నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు ప్రజాదర్బార్​కు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు.

గుండె జబ్బుతో బాధపడుతున్న స్వాతి అనే యువతి, తల్లిదండ్రులు చనిపోయి అనాథగా మారిన విద్యార్థి సంతోషి రూపను తానే దత్తత తీసుకొని చదివిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ కు చెందిన సరిత ఢిల్లీ ట్రాన్స్​పోర్ట్​కార్పొరేషన్ లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ తెలంగాణ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్ కు బదిలీ కోసం మంత్రిని ఆశ్రయించారు.

తక్షణమే ఆయన ట్రాన్స్​పోర్ట్​ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి సరితకు తెలంగాణలో ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజాదర్బార్ లో ఎస్పీ శరత్ చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఆర్డీవో రవి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.