బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు : మంత్రులు

నల్లగొండ ఎంఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ లో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా పాలనపై ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా ఇన్ చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. 

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలను అమలు చేశామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 

డిసెంబర్28 నుండి జనవరి 6 వరకు ప్రజా పాలన పారదర్శకంగా చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, ప్రాజెక్టుల వద్దే కుర్చీ వేసుకుని.. నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్న వారిలా తాము ఉండమన్నారు. పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

గతంలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో తనకు మంచి రాజకీయ సంబంధం ఉందన్నారు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. తన హయాంలో మొదలైన ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో పూర్తి కాబోతున్నాయని చెప్పారు. ఈ ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామన్నారు.