నిజామాబాద్​ జిల్లాలో రూ.250 కోట్లతో రోడ్ల నిర్మాణం : మంత్రి కోమటి​రెడ్డి వెంకట్​రెడ్డి

నిజామాబాద్​ జిల్లాలో రూ.250 కోట్లతో రోడ్ల నిర్మాణం : మంత్రి కోమటి​రెడ్డి వెంకట్​రెడ్డి
  • వడ్ల బోనస్ రూ.73 కోట్లు చెల్లించినం
  • మూడు రోజుల్లో రూ.254 కోట్ల ధాన్యం పేమెంట్స్​
  • మౌలిక వసతుల పరిశీలన బాధ్యత కలెక్టర్​దే 

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.250 కోట్లు మంజూరు చేసినట్టు ఆర్​అండ్​బీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మొదటి విడతగా రూ.100 కోట్లు, సెకండ్​ ఫేజ్​లో రూ.150 కోట్లు ఇస్తామన్నారు. శుక్రవారం ధర్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన కలెక్టరేట్​లో ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఆర్వోబీ పనులకు సంబంధించి తన శాఖలో ఎవైనా క్లియరెన్స్​ అవసరమైతే తక్షణమే ప్రపోజల్స్​ పంపాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతును ఆదేశించారు. 

గ్రామ పంచాయతీ ఎలక్షన్స్​జరిగేదాకా వాటర్, శానిటేషన్, స్ట్రీట్​ లైట్స్​ తదితర వసతులకు సంబంధించి కలెక్టర్​ బాధ్యత తీసుకొని స్పెషల్​ ఆఫీసర్లతో నిత్యం సమీక్షించాలన్నారు.  ప్రతీ ఇంటికి సురక్షిత నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ​వడ్ల కొనుగోళ్లపై రివ్యూ నిర్వహించిన ఆయన సన్నాలు సాగు చేసి అమ్మిన జిల్లా రైతులకు ఇప్పటి వరకు రూ.73 కోట్ల బోనస్​ చెల్లించామన్నారు. బోనస్​పై దుష్ప్రచారం చేసిన బీఆర్​ఎస్​ లీడర్లకు నిజామాబాద్​అన్నదాతలే సమాధానమన్నారు. సర్కారు కొనుగోలు చేసిన 4.86 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లకు సంబంధించి రూ.736 కోట్లు చెల్లించామని, మిగిలిన రూ.254 కోట్లు మూడు రోజులలో చెల్లించాలని కలెక్టర్​ను ఆదేశించారు. 

నేషనల్​ హైవేగా  బోధన్–మద్నూర్​ రోడ్డు​ 

ట్రాఫిక్​ ఆధారంగా రోడ్లను విస్తరిస్తామని మంత్రి  తెలిపారు. బోధన్–-మద్నూర్​ రోడ్డు ప్రతిపాదనలు తనకు  పంపితే నేషనల్​ హైవే​ తెస్తానన్నారు. ఫారెస్ట్​ డిపార్టమెంట్​పర్మిషన్ల పేరుతో రోడ్​ నిర్మాణ పనులు ఆపొద్దని ఇందల్వాయి-– భీంగల్ రోడ్​ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో సీసీ రోడ్లున్న చోట బీటీ, బీటీ ఉన్న చోట ట్రాఫిక్​ ఆధారంగా డబుల్​ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తానన్నారు.   

ALSO READ | అప్పులున్నా పథకాలు ఆపలే : మంత్రి సీతక్క

నిర్మించిన రోడ్లు దెబ్బతినకుండా ఆధునిక టెక్నాలజీలో పనులు చేపడుతున్నామన్నారు. వార్షిక ప్లాన్​ ప్రకారం ఆఫీసర్లు నిర్మాణాలు పూర్తి చేయాలని, లేకుంటే ఫండ్స్​వెనక్కుపోయే ప్రమాదముందన్నారు. సంక్రాంతి నాటికి గుంతలులేని రోడ్లు ఉండాలనే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.  ఆర్మూర్​– జగిత్యాల, జగిత్యాల–-మంచిర్యాల రోడ్డు నిర్మాణం తమ పరిశీలనలో ఉందన్నారు. ఆఫీసర్లతో మంత్రి నిర్వహించిన సమీక్షలో ఆర్మూర్​, బాల్కొండ సెగ్మెంట్​ కాంగ్రెస్​ ఇన్​చార్జిలు వినయ్​రెడ్డి, ముత్యాల సునీల్​రెడ్డి  అధికారులను ప్రశ్నించడం వివాదాస్పదమైంది. 

పిల్లలపై పేరెంట్స్​నిఘా అవసరం

పెద్ద స్కూల్​లో  చేర్పించామనే ధీమాతో ఉండొద్దని, పిల్లల నడవడికను పేరెంట్స్​ గమనిస్తూ ఉండాలని  మంత్రి సూచించారు. శుక్రవారం రాత్రి నగరంలోని ఆర్​బీవీఆర్​ స్కూల్​42వ వార్షికోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు. చదువులో వెనుకబడిన స్టూడెంట్​ పట్ల టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోని వారిని ప్రయోజకులను చేయాలన్నారు. ఈ స్కూల్​లో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరిన వారిని మంత్రి సన్మానించారు. రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రిన్సిపాల్​వీణారెడ్డి, స్కూల్​ సొసైటీ ప్రెసిడెంట్​ మహేందర్​రెడ్డి, సెక్రటరీ గోవర్ధన్​రెడ్డి, చైర్మన్​ జగత్​రెడ్డి, అమర్జిత్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.