నల్గొండ అర్బన్, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నల్గొండలోని గంధంవారిగూడెంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని మండిపడ్డారు.
నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ పదో తరగతి చదువుతున్నాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తుందన్నారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీపడాలని ఉద్దేశంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రైవేట్ స్కూళ్లు మూతపడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామని తెలిపారు. గత ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తామని ప్రకటించిందని, ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. రెండేండ్లలో ఎస్ఎల్ బీసీ సొరంగ మార్గం పూర్తి చేసి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల కాళ్లు కడుగుతామని తెలిపారు. రుణమాఫీ కానీ రైతులకు త్వరలో మాఫీ చేస్తామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతోపాటు అన్ని వసతులు ఉంటాయని చెప్పారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల శంకుస్థాపనతో తెలంగాణకు ఒకరోజు ముందే దసరా పండుగ వచ్చిందన్నారు. రూ.5 వేల కోట్లతో రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో మొదటి విడత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశామన్నారు. నల్గొండలో నిర్మిస్తున్న ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను 8 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. 25 ఎకరాల్లో ఈ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. నల్గొండలో చేపట్టిన మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, నవంబర్‌లో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.
ఇండ్లులేని పేదవారికి రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీలు రామ్ రెడ్డి, లక్ష్మయ్య, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.