కలెక్టర్​పై దాడిని కేటీఆర్ సమర్థించడం సిగ్గుచేటు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

జహీరాబాద్, వెలుగు: కలెక్టర్, ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడాన్ని బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్​ సమర్థించడం సిగ్గుచేటని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. గురువారం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ జహీరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కలెక్టర్, ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన సురేశ్​ రేప్  కేసులో నిందితుడని, అతనిపై రౌడీషీట్​ ఉందని, అలాంటి వ్యక్తికి కేటీఆర్  మద్దతుగా నిలవడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

అధికారం పోయేసరికి కేసీఆర్, కేటీఆర్ లకు దిక్కు తోచడం లేదన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్నది కాకుండా, మళ్లీ అధికారంలోకి వచ్చి మరింత దోచుకోవాలని చూస్తున్నారన్నారు. ప్రజలు గుణపాఠం నేర్పినా, వారిలో మార్పు రావడం లేదన్నారు. రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో యంగ్  ఇండియాలో భాగంగా ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్  హాస్టళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.

డిసెంబర్  వరకు రైతులకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. కొత్త టెక్నాలజీతో రోడ్లపై గుంతలు పూడ్చే యంత్రం కొనుగోలు చేశామన్నారు. పైలట్  ప్రాజెక్టుగా మొదట చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే రోడ్డుపై గుంతలు పూడ్చేందుకు శ్రీకారం చుట్టామని, త్వరలోనే రాష్ట్రంలో గుంతలు పడ్డ రోడ్లకు రిపేర్లు చేస్తామని తెలిపారు. ఆయన వెంట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, సెట్విన్  చైర్మన్  గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి, నర్సింహారెడ్డి ఉన్నారు.