
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష నేత కేసీఆర్అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ఎమ్మెల్యేలు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ గతంలో ఓ పాస్ట్పోర్ట్దొంగ అని తాను వాళ్లకు గుర్తు చేయదలచుకున్నానని ఘాటుగా కామెంట్ చేశారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంతో సహా వెళ్లి సోనియా గాంధీతో ఫోటో దిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని త్యాగం చేస్తే, పొన్నం ప్రభాకర్ తో పాటు మిగతా ఎంపీలు ఢిల్లీలో కాంగ్రెస్‌పై ఒత్తిడి చేశారన్నారు.
బుధవారం అసెంబ్లీ లాబీల్లోని తన ఆఫీస్ లో మంత్రి చిట్ చాట్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎమోషనల్ గా ఉందన్నారు. తాను ఏదైనా మాట్లాడితే కొంత మంది ట్రోల్ చేస్తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విషప్రచారం చేయిస్తోందని, ఇందుకోసం గత పదేండ్లు సంపాదించిన అవినీతి సొమ్మును ఖర్చు చేస్తోందన్నారు. 18 నెలల్లో ఉప్పల్–నారపల్లి ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామని, రాబోయే రెండేళ్లలో వరంగల్ లో ఫ్లైట్ ఎగురుతుందని మంత్రి చెప్పారు.
అసెంబ్లీ సెక్రటరీపై మంత్రి పొన్నం ఫైర్
జర్నలిస్టుల దగ్గర ఉన్న పాత అసెంబ్లీ పాస్ లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులును పిలిచి చీవాట్లు పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి15 నెలలు గడిచినా ఇంకా పాత పాస్ లు ఎందుకు కొనసాగిస్తున్నారని, ఇంకెపుడు మారుస్తారని నిలదీశారు. త్వరలోనే మీడియా కమిటీ ఏర్పాటు చేసి కొత్త పాస్ లు ఇస్తామని మంత్రికి సెక్రటరీ సమాధానమిచ్చారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులు గడిచినప్పటికీ మీడియా ప్రతినిధులకు టెంపరరీ పాస్‌లు ఇవ్వకపోవడం గమనార్హం.