- కేటీఆర్, హరీశ్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్
- పదేండ్లు లక్షల కోట్లు అప్పు జేసి కనీసం మూసీని బాగుచేయలే
- మూసీ మురికితో బాధలేందో నల్గొండకు వచ్చి చూస్తే తెలుస్తది
- లక్షన్నర కోట్ల ప్రాజెక్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్
- నిర్వాసితులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ పదేండ్లు లక్షల కోట్ల అప్పులు చేసినా మూసీ నదిని కూడా బాగు చేయలేకపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మూసీ మురికి నీటితో నల్గొండ జిల్లాను ఆగం చేశారని.. ఆ నీళ్లు, పొల్యూషన్ తో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ మురికితో బాధలెట్లుంటయో నల్గొండకు వచ్చి చూస్తే తెలుస్తాయన్నారు. మూసీ ఏరియా ప్రజలకు భరోసా కల్పించకుండా హరీశ్‌రావు, కేటీఆర్ రెచ్చగొడుతున్నారని.. ఆ ఇద్దరికీ మానవత్వం లేదని ఆయన మండిపడ్డారు.
మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మూసీ నిర్వాసితులకు తమ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. ‘‘మూసీ నదిని బాగు చేస్తే కోటి మంది ప్రజలకు లాభం జరుగుతుంది. నది సుందరీకరణను బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డుకుంటే ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు. “మూసీ మురికి, పొల్యూషన్ నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారాయి. వాళ్ల బాధలేందో బీఆర్ఎస్ నేతలు వస్తే నేనే తీసుకెళ్లి చూపిస్త. పెద్ద అంబర్ పేట్, కుంట్లూర్ వాసులు మూసీ వ్యర్థాలతో గోసపడ్తున్నరు. గత బీఆర్ఎస్ సర్కార్ మిషన్ భగీరథ పథకం కింద రూ.6 వేల కోట్లు ఖర్చు చేసినా.. నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ సమస్యలు ఇంకా పోలేదు. మూసీ మురికి, ఫ్లోరైడ్ సమస్యలతో నల్గొండ జిల్లా ప్రజల బతుకులు ఆగమవుతున్నాయి” అని ఆయన అన్నారు.
త్వరలో మురికి బాధల నుంచి విముక్తి
హైదరాబాద్ అభివృద్ధి కోసమే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామని.. త్వరలో ప్రజలను మూసీ మురికి బాధల నుంచి, వరద ముంపు నుంచి విముక్తి లభిస్తుందని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక మూసీ అభివృద్ధి చెందుతుందనుకుంటే ఆ పని జరగలేదు. ఎస్ఎల్బీసీ బాగు చేస్తే ఎక్కడ నాకు పేరు వస్తదోనని కేసీఆర్ పట్టించుకోలేదు. అవసరం లేకున్నా మల్లన్నసాగర్ 50 టీఎంసీలకు కట్టిన్రు. దీనికి రూ. 15 వేల కోట్ల టెండర్ ఏపీ కాంట్రాక్టర్ కు ఇచ్చిన్రు. కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ఇవన్నీ తుగ్లక్ పనులు” అని ఆయన మండిపడ్డారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై గత సర్కార్ దాడులు చేయించిందని అన్నారు.
డీపీఆర్ రెడీ కాకముందే.. లక్షన్నర కోట్లంటరా?
మూసీ ప్రక్షాళనను బీఆర్ఎస్ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి వెంకట్‌రెడ్డి ప్రశ్నిం చారు. మూసీ కాల్యుష్యంపై ఎన్నో పుస్తకాలు, రీసెర్చ్ లు ఉన్నాయని.. వాటిని కేటీఆర్, హరీశ్ చదివి తెలుసుకోవాలని సూచించారు. డీపీఆర్ రెడీ కాకముందే రూ. లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.