రోడ్ల రిపేర్లు త్వరగా పూర్తి చేయండి

 రోడ్ల రిపేర్లు త్వరగా పూర్తి చేయండి
  • అన్ని జిల్లాల ఎస్ఈలకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్ని జిల్లాల ఎస్ఈలను ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. గుంతలను వేగంగా పూడ్చేలా పాట్ హోల్ ఫిల్లింగ్ యంత్రాలను వాడాలన్నారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రోడ్ల రిపేర్లు, హ్యామ్ రోడ్ల ఎంపికపై శుక్రవారం సెక్రటేరియట్ నుంచి మంత్రి ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన కన్సల్టెన్సీతో పాటు జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లను ఎంపిక చేయాలని చెప్పారు. 

తీవ్రంగా దెబ్బతిని, రాకపోకలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రహదాలను మాత్రమే హ్యామ్ రోడ్ల కింద ఎంపిక చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర  సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రహదారులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో గత పదేండ్లుగా రిపేర్లు జరగకపోవడం వల్ల ఇప్పుడు అనేక రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రివ్యూలో ఆర్ అండ్ బీ సెక్రటరీ హరిచందన, సీఈ తిరుమలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.