అటవీ అనుమతులు తెచ్చి రోడ్డు పనులు స్పీడప్​ చేయాలి : మంత్రి కోమటిరెడ్డి

అటవీ అనుమతులు తెచ్చి రోడ్డు పనులు స్పీడప్​ చేయాలి : మంత్రి కోమటిరెడ్డి
  • టిమ్స్, నిమ్స్, వరంగల్  హాస్పిటల్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
  •  ఆర్ అండ్ బీ  సీఈలకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: అటవీ అనుమతులు రాకపోవడం వల్ల చాలా రోడ్డు పనులు పెండింగ్​లో పడ్తున్నాయని, ఫారెస్ట్​ క్లియరెన్స్ లు తెచ్చి ఆ పనులు స్పీడప్ ​చేయాలని ఇంజినీర్లను ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. వచ్చే వారం నిర్వహించే ప్రీ బడ్జెట్ మీటింగ్ కు సిద్ధం కావాలని సూచించారు. ఆర్ అండ్ బీ లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఐదుగురు సీఈలు జయభారతి, రాజేశ్వర్ రెడ్డి, తిరుమల, చిన్న పుల్లదాసు, శ్యామ్ కుమార్ తో మంత్రి శనివారం హైదరాబాద్  లోటస్ పాండ్ లోని తన నివాసంలో రివ్యూ చేపట్టారు.

 ఇప్పటి వరకు ఈఎన్సీగా ఉన్న మధుసూదన్ రెడ్డి శుక్రవారం రిటైర్  కావడంతో మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లు, రూరల్ రోడ్లు, బిల్డింగ్స్, అడ్మినిస్ర్టేషన్, సీవోటీ మెంబర్, రైల్వే సేఫ్టీ వర్క్స్ అంశాలు ఐదుగురు సీఈలకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి వారికి అభినందనలు తెలిపారు. కేటాయించిన అంశాలపై స్టడీ చేసి తనకు వారంలోగా రిపోర్ట్  అందజేయాలని మంత్రి ఆదేశించారు. అర్ అండ్ బీ లో ప్రమోషన్ల కోసం ఆరేండ్ల పాటు వెయిట్ చేసిన ఏఈఈలకు ప్రమోషన్లు దక్కాయి. డీపీసీ ప్యానల్  సూచించిన రూల్స్  మేరకు 118 ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్లు కల్పించారు.