పటౌడీ హౌస్లో తెలంగాణ భవన్.. రెండేండ్లలో మామునూరు ఎయిర్ పోర్టు: మంత్రి కోమటిరెడ్డి

పటౌడీ హౌస్లో తెలంగాణ భవన్.. రెండేండ్లలో మామునూరు ఎయిర్ పోర్టు: మంత్రి కోమటిరెడ్డి

= ఢిల్లీలో తెలంగాణ భవన్ అన్ని వసతులతో నిర్మిస్తం
= స్టార్  హోటళ్లకు ఇచ్చేది లేదు
=ఎయిర్ పోర్టు నిర్మాణానికి జీఎంఆర్ నుంచి ఎన్వోసీ తీసుకున్నం
= పర్వత మాల ప్రాజెక్టు కింద 5 రోప్ వేలు అడిగాం

ఢిల్లీ: దేశ రాజధానిలోని పటౌడీ హౌస్ లో అన్ని వసతులతో తెలంగాణ భవన్ నిర్మించబోతున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆ భవనాన్ని ఎట్టి పరిస్థితిలోనూ స్టార్ హోటళ్లకు ఇవ్వబోమని అన్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు  నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడును  రాష్ట్ర ఎంపీలతో కలిసి రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై వినతిపత్రాలు  సమర్పించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేండ్లలో మామునూరు ఎయిర్ పోర్టు పూర్తవుతుందని చెప్పారు. పదిహేను రోజుల్లో భూసేకరణ పూర్తవుతుందని, ఇందుకోసం జీఎంఆర్ సంస్థ నుంచి ఎన్వోసీ కూడా తీసుకున్నామని చెప్పారు. 

ఈ సందర్భంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి  రామ్మోహన్  నాయుడు కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఆదిలాబాద్ ,నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఫిజబిలిటిని  పరిశీలించాలని ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులను ఆదేశించారని చెప్పారు. ట్రిపుల్ ఆర్ కు 95% భూసేకరణ పూర్తయిందని, కేబినెట్ అప్రూవల్ ఇస్తే  పరిహారం చెల్లించవచ్చాన్నారు. హైదరాబాద్– విజయవాడ ఆరు లేన్ల రహదారికి టెండర్లు పిలవాలని కోరినట్టు చెప్పారు. 

రెండు ప్యాకేజీలుగా రోడ్డు నిర్మాణానికి నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లు పిలిచేందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని  చెప్పారు. పర్వత మాల ప్రాజెక్టుల కింద ఐదు రోప్ వేలను అడిగినట్టు కోమటిరెడ్డి వివరించారు. అలాగే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ను వేగవంతం చేయాలని కోరినట్టు వివరించారు.  మంత్రి వెంట ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్  కుమార్ రెడ్డి, రామ సహాయం రఘురామరెడ్డి తదితరులు ఉన్నారు.