కేటీఆర్​ పిచ్చి కూతలు మానుకో .. మంత్రి కోమటిరెడ్డి ​హెచ్చరిక

యాదాద్రి, వెలుగు:  అధికారం పోయిందన్న షాక్​లో కేటీఆర్  కొత్త ప్రభుత్వంపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా అట్ల మాట్లాడుడు మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హెచ్చరించారు. తాము తలుచుకుంటే బీఆర్​ఎస్​ను 14 ముక్కలు చేస్తామని అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం వెంకట్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ సర్కార్ ఆరు నెలల్లో కూల్తదని ఒకడు.. ఏడాదిలో కూలిపోతదని ఇంకొకడు అంటున్నడు. అధికారం పోయిందన్న షాక్​లో పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు.. ఆలోచించి మాట్లాడ్తే బాగుంటది” అని కేటీఆర్​, హరీశ్​రావుపై మండిపడ్డారు. పదేండ్లలో బీఆర్ఎస్ లీడర్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అప్పుల్లో ముంచారని, ప్రజల భూములు గుంజుకున్నారని అన్నారు. బీఆర్​ఎస్​ వాళ్లు దోచుకున్న సొమ్ముతో 20 ఏండ్ల పాటు పేదలకు స్కీమ్​లు అమలు చేయొచ్చని తెలిపారు. ‘‘రైతులను కేటీఆర్ రెచ్చగొడ్తున్నడు. రైతులు తలచుకుంటే బీఆర్​ఎస్​ నేతల అక్రమ ఆస్తులను గుంజుకుంటరు.  

మేము తలుచుకుంటే.. బీఆర్ఎస్​ను 14 ముక్కులుగా చీలుస్తం’’ అని వెంకట్ రెడ్డి అన్నారు.  ‘‘వందల ఎకరాలు ఉన్న మల్లారెడ్డి, రామేశ్వర రావు లాంటోళ్లకు రైతు బంధు ఇచ్చిన్రు. కౌలు రైతులకు ఎందుకు ఇయ్యలే?” అని ప్రశ్నించారు.  ‘‘యాదాద్రి పవర్ ప్లాంట్ పేరుతో జగదీశ్ రెడ్డి తో కలిసి మీరంతా రూ.10 వేల కోట్లు దోచుకున్నరు. ఇట్ల తొమ్మిదేండ్లలో మీరు దోచుకున్న డబ్బులతో 20 ఏండ్ల పాటు స్కీమ్​లు అమలు చేయొచ్చు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్​మెంట్ పేరుతో అవసరం లేకున్నా బ్రిడ్జి కట్టిన్రు’’ అని అన్నారు. యాదాద్రిపైకి ఆటోలు అనుమతించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దొంగ జీవోలతో హెచ్​ఎండీఏ నిధులను బీఆర్ఎస్ కార్యకర్తలకు అప్పగించారని ఆరోపించారు.

త్వరలోనే కరెంట్ బిల్లుల మాఫీ స్కీమ్

200 యూనిట్లలోపు కరెంట్ బిల్లుల మాఫీ స్కీమ్​ను త్వరలో అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజాభవన్​, సెక్రటేరియెట్​ను ప్రజలకు దగ్గర చేశామని తెలిపారు. 40 రోజుల్లోనే రెండు గ్యారంటీల అమలు మొదలుపెట్టామని, వంద రోజుల్లో మిగిలిన నాలుగు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. 

ట్రిపుల్​ ఆర్ అలైన్​మెంట్​పై మళ్లీ సర్వే చేస్తం

ట్రిపుల్ ఆర్ అలైన్​మెంట్​పై మళ్లీ సర్వే చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 60 కిలో మీటర్ల దూరం నుంచి రావాల్సిన రింగ్ రోడ్డును ఎవరు ముందుకు జరిపించారో తేలాల్సి ఉందని చెప్పారు. రాయగిరి ప్రజల ఆవేదన తాము అర్థం చేసుకున్నామని, అలైన్​మెంట్​పై మళ్లీ పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ‘‘కొండపోచమ్మ వద్ద ఇచ్చిన పరిహారానికి.. బస్వాపురం నిర్వాసితులకు ఇచ్చిన పరిహారానికి ఎంతో వ్యత్యాసం ఉంది. 18 ఏండ్లు దాటిన వారిని కూడా నిర్వాసితులుగా గుర్తించి వారికి పరిహారం అందించే అంశంపై ఆలోచిస్తాం’’ అని వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు.