- జడ్పీ జనరల్‌బాడీ మీటింగ్‌లో మంత్రి కోమటిరెడ్డి,మండలి చైర్మన్ గుత్తా
- ఆసక్తికర వ్యాఖ్యలు భగీరథ, విద్యుత్‌శాఖలపై వాడీవేడిగా సాగిన చర్చ
- జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేశాం : మంత్రి కోమటిరెడ్డి
- సాగునీటి ప్రాజెక్టులు త్వరగా కంప్లీట్చేయాలి : మండలి చైర్మన్ గుత్తా
నల్గొండ, వెలుగు : మా ఊళ్లలో మిషన్‌భగీరథ నీళ్లు రావట్లేదని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్గొండ జడ్పీ కార్యాలయంలో చివరి జనరల్ బాడీ మీటింగ్జరిగింది. వచ్చే నెల 4న జడ్పీ పాలకవర్గం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మిషన్‌భగీరథ, విద్యుత్‌శాఖల పనితీరుపై వాడీవేడిగా చర్చ సాగింది.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నా సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంలలో భగీరథ నీళ్లు రావడం లేదని, సగం ఇళ్లకే వస్తున్నాయని, అసలు ఎప్పుడు వస్తున్నాయో కూడా తెల్వడం లేదని మంత్రి అధికారులపై ఫైర్అయ్యారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం తన సొంత గ్రామం ఉరుమడ్లలో కూడా భగీరథ నీళ్లు రావడం లేదని చెప్పడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.
ఇప్పటికైనా భగీరథ అధికారులు ఇంటింటికీ తిరిగి సమస్యలు గుర్తించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగుస్తున్నందున వచ్చే నెల 1 నుంచి ఏఈలు మీటింగ్ లు పెట్టి ఎక్కడికక్కడే తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎస్ఈ వెంకటేశ్వర్లను మంత్రి ఆదేశించారు.
విద్యుత్‌సరఫరా అస్తవ్యస్తంగా మారిందని, మిర్యాలగూ డలో కరెంట్‌కోతలు తీవ్రమయ్యాయని మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ తిప్పన విజ యసింహారెడ్డి ఫిర్యాదు చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్మాట్లాడుతూ విద్యుత్ లైన్లు మార్చకపోవడంతో సరఫరా అస్తవ్యస్తంగా మారిందన్నారు. విద్యుత్‌సమస్యల కొరకు ఒక్కో నియోజకవర్గానికి రెండు కోట్లు కేటాయించేలా మం త్రి చొరవ చూపించాలని కోరారు.
పలువురు సభ్యులు సైతం విద్యుత్సమస్య తీవ్రంగా ఉందని చెప్పడంతో మంత్రి సీరియస్అయ్యారు. లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా ఇప్పటికే జిల్లాకు రూ.18 కోట్లు మంజూరు చేశామని, ట్రాన్స్ఫార్మ ర్లు, సబ్స్టేషన్లు, స్తంబాలకు ఫండ్స్ వాడుకోమని చెప్పామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ శాలిగౌరారం పీహెచ్‌ఎసీ పనితీరు మెరుగుపర్చుకోవాలని చెప్పారు. జాతీయ రహదారి నుంచి ఇరుకులపాడు కు రోడ్డు వేయాలని మంత్రిని కోరారు.
తాగు, సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయాలి : మండలి చైర్మన్‌గుత్తా
జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చివరి దశలో ఆగిపోయాయని, వాటికి త్వరగా ఫండ్స్ రిలీజ్ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. డిండి, పెండ్లిపాకల, నక్కలగండి, ఉదయసముద్రం, ఎస్ ఎల్బీసీ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ధర్మారెడ్డి, పిలాయిపల్లి కెనాల్స్ పనులు పూర్తయ్యాయి.. కానీ చివరి ఆయకట్టుకు నీరు రాకుండా మోటార్లు,పైపు లైన్స్ ద్వారా అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు.
ఎస్డీఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేసి పెండింగ్ బిల్లులు క్లియర్చేయాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డిని మంత్రి, మండలి చైర్మన్, ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్ తదితరులు పా ల్గొన్నారు.