బీఆర్ఎస్​ కూలేశ్వరం కట్టింది : మంత్రి వెంకట్​రెడ్డి

బీఆర్ఎస్​ కూలేశ్వరం కట్టింది : మంత్రి వెంకట్​రెడ్డి
  • నల్గొండలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు రాలే: మంత్రి వెంకట్​రెడ్డి
  •  చివరి రోజు అసెంబ్లీలో రైతు భరోసాపై సుదీర్ఘ చర్చ
  •  కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యతీవ్ర వాగ్వాదం 
  • 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తం: కేటీఆర్
  • రైతు బంధుతో సాగు విస్తీర్ణం పెంచామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయే ప్రాజెక్టు కూలేశ్వరం కట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ అమ్మిన పైసలతో రుణమాఫీని ఆరు సార్లు చేస్తే వడ్డీలకే సరిపోయిందన్నారు. నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని, ఇచ్చామని నిరూపిస్తే ఇక్కడే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. శనివారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ రైతు భరోసాపై చర్చకు అవకాశం ఇచ్చారు. దీనిపై సభ ప్రారంభమైనప్పటి నుంచి అసెంబ్లీ వాయిదా పడేంత వరకు సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా నీళ్లు, విద్యుత్, రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు చర్చకు రాగా..  కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు. 

కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో నీళ్లు, కరెంట్ ఇచ్చామని, ప్రాజెక్టులు కట్టామని, రైతు ఆత్మహత్యలు తగ్గాయని అన్నారు. రైతుబంధు పథకం రైతుల బతుకు మార్చిన గేమ్ చేంజర్ అన్నారు. సాగు విస్తీర్ణం పెంచేందుకే రైతుబంధు ఇచ్చామని, 2019–20లో సాగు విస్తీర్ణం141 లక్షల ఎకరాలుండగా, 2020-–21లో సాగు విస్తీర్ణం 204 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. కాంగ్రెస్ నాయకులు 24 గంటల ఫ్రీ కరెంటు ఇస్తున్నామని చెప్తున్నారని.. ఏ ఒక్క లాగ్ బుక్ లో అయినా 24 గంటల విద్యుత్ ఇచ్చినట్లు ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని అన్నారు.

 వంద శాతం రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతోందని ఏ ఊరికైనా వస్తా.. వంద శాతం రుణమాఫీ చేశారని నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు పొడిగించి విద్యుత్, ఇరిగేషన్, మిషన్ భగీరథపై చర్చించాలని కోరారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపైనా ఒక రోజు చర్చించాలన్నారు. 

ఉచిత విద్యుత్ ఘనత కాంగ్రెస్ పార్టీదే.. 

మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కల్పించుకోని మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ మోసం చేసిందని, తాను లాగ్ బుక్ లు చెక్ చేస్తే,  10 నుంచి12 గంటలు కూడా కరెంట్ రాలేదని తేలిందని, అప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న లాగ్ బుక్ లన్నీ హైదరాబాద్ కు తెప్పించుకొని లాకర్లో పెట్టారని విమర్శించారు. నల్గొండ జిల్లాకు ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని, అదనంగా నీళ్లు ఇచ్చామని నిరూపిస్తే ఇక్కడే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చాక 25 లక్షల మందికి రూ.2 లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పులు చేస్తే కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డదని ఆరోపించారు. ‘‘బావ బామ్మర్దికి నల్లగొండ అంటే ఎందుకంత కోపం..? ఇద్దరు నల్లగొండకు ఇంత విషమిచ్చి  చంపండి’’ అని మంత్రి వెంకట్ రెడ్డి అన్నారు. 

కేటీఆర్​కు మంత్రులు, ఎమ్మెల్యేల కౌంటర్​ 

కేటీఆర్ తన ప్రసంగాన్ని మళ్లీ మొదలుపెడుతూ.. ‘‘కాంగ్రెస్ పాలనలో రుణమాఫీ పూర్తి కాలేదు. రైతు భరోసాలో కోతలు పెట్టొద్దు” అని కోరారు. అదానీ కోసం రైతులను అరెస్ట్ చేయవద్దని కేటీఆర్ అనడంతో మంత్రి సీతక్క స్పందించారు. ‘‘రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ది కాదా? రైతులు వరి వేస్తే ఉరి అన్నదెవరు? కొండలు, గుట్టలకు రైతుబంధు ఇవ్వాలా’’ అని నిలదీశారు. ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి  స్పందిస్తూ  గతంలో కేటీఆర్ ను కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని అడిగితే పట్టించుకోలేదని, ఆయనకు కౌలు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

స్పీకర్​పై హరీశ్ వ్యాఖ్యలు.. సభ్యుల ఆగ్రహం

శాసనసభ 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను సమయానికి ఎందుకు నడపడం లేదన్నారు. చట్టాలు చేసే మనం ఆదర్శంగా ఉండాలని స్పీకర్‌‌‌‌ ను కోరారు. దీనికి స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ‘‘ఎప్పుడూ పెద్ద లేట్ కాలేదు.  ఇయ్యాల జీరో అవర్ తీసుకోవాలనే అంశంపై చర్చించాం. అందుకే కొద్దిగా ఆలస్యమైంది” అని పేర్కొన్నారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ హరీశ్ కామెంట్స్​పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ సమయానికి నడిపామా లేదా అన్నది ముఖ్యం కాదని, ప్రజా సమస్యలు ఎన్ని పరిష్కారమయ్యాయన్నది ముఖ్యమన్నారు. స్పీకర్​పై​ హరీశ్​ ​చేసిన కామెంట్స్ ను  సీఎంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  తీవ్రంగా ఖండించారు.

కేటీఆర్​కు స్పీకర్ చురక

సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అని ఏక వచనంతో సంబోంధించడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ నాయకుడిని ఏకవచనంతో  సంబోంధించొద్దని చురకలు అంటించారు. స్పీకర్ అభ్యంతరానికి ఓకే చెప్పి తన ప్రసంగాన్ని  కేటీఆర్​ స్టార్ట్ చేశారు.

కోమటిరెడ్డి, హరీశ్ రావు మధ్య డైలాగ్ వార్..

రైతు భరోసాపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి, హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. మిషన్ భగీరథలో రూ.50 వేల కోట్లు తిన్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్​రావు ఏం మాట్లాడుతున్నారని నిలదీశారు. నాగార్జున సాగర్ కేసీఆర్ కట్టారా? వాళ్ల నాన్న కట్టిండా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడుగుదామని హరీశ్ రావు, కేటీఆర్ చర్చకు రావాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హరీశ్ మాట్లాడుతూ మిషన్​భగీరథ ప్రాజెక్టు మొత్తానికే రూ.50వేల కోట్లు ఖర్చు చేయలేదని.. ఖర్చు కంటే ఎక్కువ అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

భగీరథ నీళ్లు రాలేదు: మంత్రి జూపల్లి

మంత్రి జూపల్లి కృష్ణారావు కలగజేసుకుని ఇప్పటికీ 60 శాతం గ్రామాల్లో భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. ఒక వేళ అన్ని గ్రామాలకు నీళ్లు వస్తున్నాయని నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ క్రమంలో సభలో ఇరుపక్షాల సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కలగజేసుకుని రైతు భరోసాపైనే చర్చించాలని కోరారు. 

ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని సూచించారు. మళ్లీ కేటీఆర్ మాట్లాడుతూ రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాకు అవసరమైన నిధులు కేటాయించలేదని.. ఎవరికి కోత పెడతారని ప్రశ్నించారు. తాము అడిగిన వాటికి తుమ్మల సమాధానం చెప్పాలన్నారు. దీంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందిస్తూ రైతు బంధుపై సలహాలు, సూచనలు ఇవ్వండి. రైతుల్లో అనుమానాలు ఎందుకు కలిగిస్తున్నారని అన్నారు.