చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు : విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్ కు బానిసలు కావద్దని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సూచించారు. శనివారం నల్లగొండలోని ఎంవీఆర్ స్కూల్​వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆంకాక్షించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పేద విద్యార్థులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశానని చెప్పారు. 

తనకు పదవి ఉన్నా లేకపోయినా పేదలకు సేవ చేస్తానని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం నల్లగొండలో స్కిల్ డెవలప్​మెంట్ భవనానికి శంకుస్థాపన చేశామని, త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పాఠశాల చైర్మన్ రవికుమార్, కరస్పాండెంట్ గీతారవికుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.