
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సూర్యాపేట, వెలుగు : లింగమంతుల స్వామి కొలువైన పెద్దగట్టును రూ.80 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఘాట్‌రోడ్డు, విశ్రాంతి భవనాలు కట్టిస్తామని చెప్పారు. బుధవారం దురాజ్ పల్లి లింగమంతులస్వామివారిని మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దగట్టు జాతరకు చిన్నా.. పెద్ద, వృద్ధులు అంతా వస్తున్నారని చెప్పారు. అయితే వయసు పైబడిన భక్తులు కాలినడకన గుట్ట ఎక్కడం కష్టంగా ఉందన్నారు. లింగమంతులస్వామి గట్టుకు ఘాట్ రోడ్డు నిర్మాణాలనికి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నిధులు మంజూరు చేస్తామన్నారు. వచ్చే ఏడాదికి ఘాట్ రోడ్డు, విశ్రాంతి భవనాలు నిర్మిస్తామని తెలిపారు.
20 ఏండ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే..
కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని, ఐదారు నెలలు కాదు.. మరో 20 ఏండ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం ఐదారు నెలలే ఉంటుందన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
ఓట్ల కోసం దేశాన్ని విడదీసి.. పాలించేది బీజేపీయేనని, మాకు అన్ని కులాలు, మతాలు సమానమని తెలిపారు. తమది సెక్యూలర్ ప్రభుత్వమన్నారు. ప్రస్తుతం దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకి సెలవిచ్చినట్లే, రంజాన్, బక్రీద్ కు ఇస్తామని వెల్లడించారు. బీజేపీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తాత దిగొచ్చినా, బీజేపీ వచ్చినా భవిష్యత్ అంతా కాంగ్రెస్‌దేనని స్పష్టం చేశారు.