నల్గొండ అర్బన్, వెలుగు : రాష్ట్రంలో క్రీడారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన కేవీఆర్ కప్ సీజన్ –1 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన క్రీడాకారులు నిరుత్సాహ పడొద్దన్నారు.
క్రీడలు మానసికోల్లాసంతోపాటు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కేవీఆర్ కప్ విజేత జట్టు దేవరకొండకు చెందినఎన్ కేఎన్ కు రూ.1,00,116 చెక్కుతోపాటు బహుమతి, రన్నర్ స్టార్ లెవెన్ టీంకు రూ.50,016 ల చెక్కుతోపాటు బహుమతి అందజేస్తారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బాలూనాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మీశ్రీనివాస్, ఆర్గనైజర్స్, క్రీడాకారులు పాల్గొన్నారు.