సన్న బియ్యంపై చిల్లర రాజకీయాలు చేయొద్దు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

సన్న బియ్యంపై చిల్లర రాజకీయాలు చేయొద్దు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

యాదాద్రి, వెలుగు : పేదవాడి ఆత్మగౌరవం కోసం ప్రారంభించిన సన్న బియ్యం స్కీమ్‌‌పై ఫొటోల పేరుతో చిల్లర రాజకీయాలు చేయొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి హితవు పలికారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేషన్‌‌ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇస్తుందని ప్రధాని ఫొటో పెట్టాలని ప్రశ్నించారు. 

తాము కట్టిన పన్నుల పైసలే ఇంకా ఇస్తలేరని మండిపడ్డారు. హైదరాబాద్‌‌లో ఎయిర్‌‌పోర్ట్‌‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఎకరాలు ఇచ్చిందని, ఇందులో ప్రభుత్వానికి 13 శాతం వాటా ఉందన్నారు. అయినా సీఎం ఫొటో పెట్టాలని మేము కోరామా ? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నిధులంటూ ఉండవని, రాష్ట్రాల నుంచే కేంద్రానికి పన్నులు పంపిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం పంపిన పన్నుల వాటాల్లో 42 శాతం మాత్రమే కేంద్రం తిరిగి ఇస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ విప్‌‌ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ఈ నెల 11న ఆలేరులో జరగనున్న బీసీ డిక్లరేషన్‌‌ విజయోత్సవ సభకు సీఎం రేవంత్‌‌రెడ్డి హాజరవుతారన్నారు. తమ ప్రభుత్వం మహిళలకే  ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు.