
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : వేసవిలో సాగు, తాగునీటి, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాది పోలిస్తే ఈసారి జిల్లాలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందని, దీంతో ఎక్కువ ధాన్యం ఐకేపీ సెంటర్లకు వచ్చే అవకాశం ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.
నెలాఖరువరకు వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. నల్గొండ పట్టణంతోపాటు గ్రామాల్లో ఎలాంటి విద్యుత్ కోతలు ఉండొద్దన్నారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీటిని అందించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. అధికారులందరూ కష్టపడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారని కోరారు. సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ట్రాన్స్‌కో ఎస్ఈ వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూ.వెయ్యి కోట్లతో ఏఎంఆర్పీ మరమ్మతులు..
ఏఎంఆర్పీ ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్, మరమ్మతు పనును రూ.1000 కోట్లతో చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఏఎంఆర్పీ ఆయకట్టు పరిధిలోకి వచ్చే కనగలులో మైల సముద్రం చెరువు, తిప్పర్తి మండలంలోని మామిడాల పెద్ద చెరువును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏఎంఆర్పీ ద్వారా కనగల్, తిప్పర్తి మండలంలోని చివరి ఆయకట్టు భూములన్నింటికీ సాగునీరు అందిస్తామన్నారు. ఏఎంఆర్పీ కింద సుమారు 2.20 లక్షల ఎకరాలకు ఇప్పటివరకు 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని వెల్లడించారు. ప్రధాన కాలువ లైనింగ్ చేపట్టేందుకు రూ.850 కోట్లు, మరో రూ.350 కోట్లతో డిస్ట్రిబ్యూటరీల మరమ్మతుకు టెండర్లు పిలుస్తామన్నారు.