పదేండ్లలో KCR ఏనాడైనా సెక్రటేరియట్‎కు వచ్చారా..? మంత్రి కోమటిరెడ్డి

పదేండ్లలో KCR ఏనాడైనా సెక్రటేరియట్‎కు వచ్చారా..? మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: బీఆర్‎ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్ ఏనాడైనా సెక్రటేరియట్‎కు వచ్చాడా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ శిల్పకళ వేదికలో ఇవాళ (అక్టోబర్ 6) కొలువుల పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రొగామ్‎కు అటెండ్ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. చెప్పినట్లుగానే ఖాళీలను భర్తీ చేస్తున్నామని అన్నారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని.. ఇందులో భాగంగానే యువతకు ఉపాధి కల్పన కోసం స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.

70 ఏండ్ల కిత్రం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన సాగర్ డ్యామ్ చెక్కుచెదరలేదని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రం మూడేండ్లకే కుప్పకూలిపోయిందని విమర్శించారు. దేశానికి వెన్నుముక లాంటి వాళ్లు ఇంజినీర్లని.. మీరంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని పని చేయండని సూచించారు. మీరు కట్టిన ప్రాజెక్టులు వందల ఏండ్లైనా కూలొద్దన్నారు. మూసీని ప్రక్షాళన చేస్తుంటే లేనిపోని ఆరోపణలు  చేస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. 

Also Read :- కేసీఆర్ కనిపించడం లేదు..గజ్వేల్ పీఎస్లో కంప్లైంట్

ఇక, మేం ఇచ్చిన నోటిఫికేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటుందని బీఆర్ఎస్ చేస్తోన్న విమర్శలకు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చింది మీరే అయితే.. మరీ నియామక పత్రాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథలో ఏఈఈలుగా సెలక్ట్ అయిన 1473 మందికి ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు.