
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహా ధర్నాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం (జనవరి 29) గాంధీ భవన్ వద్ద కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించిన మహా ధర్నా అట్టర్ ప్లాఫ్ అయ్యిందని విమర్శించారు. నల్లగొండలో బీఆర్ఎస్ మీటింగ్‌కు రైతులు, ప్రజలు నుంచి కనీస స్పందన రాలేదన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ నల్లగొండ జిల్లాను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులను బీఆర్ఎస్ పడావు పెట్టిందని.. నల్లగొండ జిల్లా వరప్రదాయిని ఎస్ఎల్బీసీ 70 శాతం పనులు పూర్తి అయిన కూడా మిగిలిన పనులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 ఎకరాల్లో నల్లగొండ జిల్లాలో మహాత్మ గాంధీ యూనివర్శిటీని తాను ఏర్పాటు చేయించానని తెలిపారు. పదేళ్ల పాలనలో ఏనాడు మహాత్మ గాంధీ యూనివర్శిటీని చూడని కేటీఆర్ కు అధికారం పోయాక గుర్తు వచ్చిందని విమర్శించారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం నల్లగొండలో ఐటీ టవర్ ఓపెన్ చేశారని ఆరోపించారు.
ALSO READ | గద్దర్ పై బండి విమర్శలు కరెక్ట్ కాదు: మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్ ఎమ్మెల్యే అయిన కేటీఆర్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన తనను విమర్శిస్తున్నాడని ఫైర్ అయ్యారు. తండ్రి చాటు కొడుకుగా కేటీఆర్, అల్లుడిగా హరీష్ రావు రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావులు నా కాలి గోటికి సరిపోరని.. వాళ్లిద్దరికి తనను విమర్శించే స్థాయి లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిలో మునిగిపోయిందని.. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో నా మీద ఒక్క అవినీతి మరక లేదన్నారు.
పదేళ్లు చేసిన పాపానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కేవలం ఒక్క సీటు మాత్రమే ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్ హరీష్ రావు కొట్లాడుకుంటున్నారని.. ఇద్దరు కలిసి ముందు కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని సూచించారు. మూసీ ప్రక్షాళనను బీజేపీ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. అలాగే.. ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గద్దర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు.