బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ నోటికి వచ్చినట్టు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని, రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోనీ అబండాలు వేస్తున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాకుండా మూడు స్థానానికి పడిపోవడం, మరోవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో అసహనానికి లోనై సీఎం రేవంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడన్నారు.
మీ హయాంలో జరిగిన దోపిడీ ఎక్కడ బయట పడుతుందోననే.. అమెరికా పోయి ప్రభాకర్ రావును ఇండియాకు రావొద్దని చెప్పావని, పదేళ్లు అధికారంలో ఉండి వేల కోట్లు ప్రజా ధనాన్ని దోచుకొన్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో కెసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత నలుగురు కలిసి 7 లక్షల కోట్లు అప్పుచేసి.. అందులో 2 లక్షల కోట్లు మీరు దోచుకు తిన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రతి పక్ష నాయకుడిగా మీ నాన్న కేసీఆర్ ఉన్నాడా లేడా..? అసలు ప్రతి పక్ష నాయకుడు నువ్వా.. మీ నాన్ననా అని ప్రశ్నించారు.
ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై నువ్వు చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపిస్తావా..? ఒక వేల నిరూపిస్తే దేనికైనా మేం సిద్ధం.. మీ పార్టీ సిద్ధమా..? అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. హరీష్ రావు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ తీసుకెళ్లి ఆలేరును ఎడారి చేశాడని.. గంధమల్ల 1.9 టీఎంసీ రిజర్వాయర్‌కు త్వరలో టెండర్లు పిలిచి ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ను ఒక్క సీటు గెల్వనివ్వనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.