- రూ.100 కోట్ల విలువైన భూమిలో పర్మిషన్ లేకుండా కట్టారని ఆగ్రహం
- నల్గొండ శివారులో భూమి కేటాయించాలని సూచన
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా కేంద్రంలో మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టిన బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం నల్గొండలో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని మెయిన్ సెంటర్‌లో సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో పర్మిషన్ లేకుండా బీఆర్ఎస్‌ఆఫీస్ కట్టారని, దాన్ని తక్షణమే కూల్చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు. ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇచ్చామని మున్సిపల్ కమిషనర్ చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా వంద నోటీసులు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని, తక్షణమే ఆఫీస్ కూల్చివేతకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆ పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం నల్గొండ శివారు ప్రాంతంలోని భూమిని కేటాయించాలని సూచించారు. బీఆర్‌ఎస్ ఆఫీస్‌ను కూల్చివేసి, ఆ స్థలంలో ప్రజలకు ఉపయోగపడేలా డిజిటల్ లైబ్రరీ, లేదంటే ఉమెన్స్ హాస్టల్ నిర్మించడంతో పాటు, ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని మంత్రి చెప్పారు.
రూ. 100 కోట్ల ఆస్తి మూడున్నర లక్షలకే...
ఆగ్రోస్‌కు చెందిన రెండు ఎకరాల భూమిలో ఓ ఎకరాన్ని గత ప్రభుత్వం బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ కోసం కారు చౌకగా అమ్మేసింది. నల్గొండ-– హైదరాబాద్మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న ఈ స్థలం మార్కెట్లో వంద కోట్లు పలుకుతోంది. మొత్తం రెండు ఎకరాలు ఉండగా ఒక ఎకరం బీఆర్‌ఎస్ ఆఫీస్‌కు ఇవ్వగా, మరో ఎకరం భూమిని ఆగ్రోస్ సంస్థ ప్రైవేట్ పెట్రోల్ బంక్ కోసం లీజ్‌కు ఇచ్చింది.
భూమిని ఆగ్రోస్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక స్థానిక తహసీల్దార్ పంచనామా చేసి, అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు రూ.3.50 లక్షలకే బీఆర్‌ఎస్ ఆఫీస్‌కు కట్టబెట్టారు. ల్యాండ్ ఆగ్రోస్‌దే అయినప్పటికీ మున్సిపల్ పాలకవర్గ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని ఆఫీసర్లు చెపుతున్నారు. పార్టీ ఆఫీస్ ప్రపోజల్ వచ్చినప్పుడే మ్యాప్ ప్రిపేర్ చేసి అప్పటి మున్సిపల్ పాలకవర్గానికి అందజేశామని బీఆర్‌ఎస్ లీడర్లు అంటున్నారు.
అన్ని పార్టీలకు ఇచ్చినట్టే ఇచ్చారు : పంకజ్‌యాదవ్
రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఇచ్చినట్టుగానే నల్గొండలో బీఆర్‌ఎస్ ఆఫీస్‌కు ప్రభుత్వం స్థలం ఇచ్చిందని బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవస్థాపకుడు పంకజ్‌యాదవ్ చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో అన్ని జిల్లాలో పార్టీ ఆఫీస్‌ల నిర్మాణం జరిగింది.. అన్ని చోట్ల ఇలాగే కూల్చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ సెంటర్‌లో టీడీపీ, కమ్యూనిస్టుల ఆఫీస్‌లు కూడా ఉన్నాయని, బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి కాంగ్రెస్ ఆఫీస్ కట్టారని కేసు నడుస్తోందని దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు.