
- అసంపూర్తి పనులన్నీ పూర్తి చేస్తున్నాం: కోమటిరెడ్డి
- అసెంబ్లీలో ఆర్ అండ్ బీ పద్దుపై మాట్లాడిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ అండ్ బీ శాఖలో రూ. 10 వేల కోట్ల బకాయిలు పెట్టి పోయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెట్టి వెంకటరెడ్డి అన్నారు. తాము మాత్రం గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఎన్నో పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో రోడ్లు భవనాల శాఖ పద్దుపై మంత్రి మాట్లాడారు.
.బీఆర్ఎస్ మధ్యలో వదిలేసిన సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ను జూన్ లోపు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే నిమ్స్ నిర్మాణం ఏడాదిలోగా పూర్తవుతుందని చెప్పారు. ఏప్రిల్ చివరి నాటికి హామ్ మోడల్ ద్వారా మండలాల నుంచి గ్రామాలకు డబుల్ లైన్ రోడ్లు వేయడానికి చర్యలు చేపడతామని తెలిపారు.
వివిధ దశల్లో ఈ హామ్ రోడ్ల పనులు చేపడతామన్నారు. రెండేండ్లలో వరంగల్ ఎయిర్ పోర్టు పూర్తయ్యేలా చూస్తానని కేంద్ర మంత్రి హామి ఇచ్చారన్నారు. ట్రిపుల్ ఆర్ కు సంబంధించి 88 శాతం భూసేకరణ పూర్తయిందని, మరో రెండు నెలల్లో అనుమతులు వస్తాయని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారన్నారు. రాష్ట్రంలో అధునాత సౌలతులతో 65 ఐటీఐలు నిర్మిస్తున్నామన్నారు.
రోడ్ల సమస్యను పరిష్కరించండి: స్పీకర్
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ దాకా 200 వందల ఏండ్ల నాటి మర్రి చెట్లు ఉన్నాయని, అవి 90 శాతం కూలిపోయే స్థితికి వచ్చాయని ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రస్తావించారు. ఆ మర్రి చెట్లు ఎప్పుడు, ఎవరి మీద పడతాయో అన్నట్టుగా ఉన్నాయని, వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
వికారాబాద్ లో బైపాస్ రోడ్డు కూడా పెండింగ్ లో ఉందన్నారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఆ చెట్ల విషయంపై ఫారెస్టు డిపార్ట్ మెంట్ తో చర్చించామని, చర్యలు తీసుకుంటామన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ది చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.