
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ, వెలుగు : ఏఎంఆర్పీ ఉదయ సముద్రం ద్వారా సాగునీరు అందించడంతో ఈ ఏడాది లక్ష ఎకరాలకు వరి సాగు పెరిగిందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంలను పూర్తి చేయడం ద్వారా మర్రిగూడెం చెరువుకు నీళ్లు ఇస్తామని, కాల్వల ద్వారా నీరు అందించేందుకు భూసేకరణ పూర్తి చేశామన్నారు. బ్రాహ్మణ వెల్లెంల ద్వారా కట్టంగూరు, నార్కట్ పల్లి, మునుగోడులో మూడు, నాలుగు నెలల్లో కాల్వలు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
కాంగ్రెస్ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఈ సీజనల్ లో జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు ఎల్లప్పుడూ వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు కూడా పండించాలని సూచించారు.
ఈనెల 30న హుజూర్నగర్ లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి రెండు సీజన్లకు సాగునీరు అందించడంతో లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందన్నారు. ధాన్యం రాకను బట్టి అవసరమైతే కోనుగోలు కేంద్రాలు పెంచుతామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్‌చైర్మన్ నాగరత్నం రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఎస్ వో హరీశ్, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, డీసీవో పత్యా నాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం..
చిట్యాల, వెలుగు : చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్ యువజన నాయకుడు ఇమ్మడి శ్రావణ్ కుమార్ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పిచారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.