- వైద్య సేవలపై ఆరా
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ప్రభుత్వాస్పత్రిని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఉదయం జిల్లా ప్రభుత్వాస్పత్రికి మంత్రి బైక్ పై వెళ్లి మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల హాజరు పట్టిక, పేషెంట్ల వివరాలను పరిశీలించారు. హాస్పిటల్ లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి అడిగారు. లిఫ్ట్ రిపేర్ చేయడానికి 10 రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానం చెప్పారు.
లిఫ్ట్ రిపేర్ కు పది రోజుల సమయం పడితే హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అనంతరం వైద్యారోగ్యశాఖ, ఆర్ అండ్ బీ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ సకల సౌకర్యాలతో అందరికీ అనువుగా ఉండేలా నూతన భవనాన్ని నిర్మించాలని సూచించారు. నెల రోజుల్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పలుచోట్ల పారిశుధ్య నిర్వహణ లోపాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్శ్రీకాంత్ భార్య హాస్పిటల్లో కవలలకు జన్మనిచ్చింది. హాస్పిటల్లో చిన్నారులను మంత్రి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట వైద్యాధికారులు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.