
హైదరాబాద్, వెలుగు: మూసీ సుందరీకరణతో లక్షలాది మంది జీవితాలు ముడిపడి ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మూసీ కాలుష్యంతో లక్షలాది మంది వివిధ జబ్బులతో నరకం అనుభవిస్తున్నారని, అలాంటి మూసీని ప్రక్షాళన చేయొద్దా..? అని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీలో కేటీఆర్ చేసిన కామెంట్లకు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘‘మూసీ ప్రక్షాళనపై మా నల్గొండ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కింది నుంచి ఫ్లోరైడ్, పైనుంచి మూసీ మురికితో ఇబ్బందులు పడుతున్నామని.. మూసీని ప్రక్షాళన చేస్తే బతుకుతామని వాళ్లంతా సంతోష పడుతున్నారు.
కానీ మీరు (కేటీఆర్) మూసీ ప్రక్షాళన కావొద్దు.. నల్గొండ వాళ్లు బతకొద్దు అనే నెగెటివ్ ఆలోచనతో ఉన్నారు” అని కోమటిరెడ్డి మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన చేయకుండా.. కూలిపోయిన కాళేశ్వరం కడితే మంచిదా..? అని ఎద్దేవా చేశారు. గ్రీన్ ఫార్మాసిటీ కట్టి కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ‘‘14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ కడతామని బీఆర్ఎస్ హయాంలో పేదల నుంచి భూములు గుంజుకున్నారు. ఒకేచోట అన్ని పరిశ్రమలు పెడితే విపరీతమైన కాలుష్యం ఉంటుందని, దానికి వ్యతిరేకంగా ఆనాడు మేం పోరాటం చేసినం” అని పేర్కొన్నారు.
హరీశ్ మాట మార్చిండు..
హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను కాపాడేందుకు ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని కోమటిరెడ్డి చెప్పారు. హైడ్రా కూల్చివేతల్లో పేదలు నష్టపోతే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని లేదంటే వేరే చోట ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. ‘‘ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని అధికారంలోకి రాకముందు హరీశ్ రావు ఇదే సభలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి ఇరిగేషన్ మినిస్టర్ అయినంక ఆ విషయమే మర్చిపోయిండు. హరీశ్ రావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పద్మాలయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, ఎన్ కన్వెన్షన్ కూలగొడతం అన్నడు. కానీ అధికారంలోకి వచ్చినంక వాళ్లతో లాలూచీపడ్డడు. ఇది బీఆర్ఎస్‌కు అలవాటే” అని విమర్శించారు.