ఎన్నికల టైమ్ లో ప్రజలకు ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వారి మాటలు నమ్మొద్దన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే, ఆర్ధికంగా ఇబ్బందులున్నా హామీలు నెరవేరుస్తున్నామని చెప్పారు. 40 వేల కోట్ల బకాయిలు ఉన్నా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్స్ ఇస్తున్నామని తెలిపారు.
నల్గొండ జిల్లా తిప్పర్తి, కనగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 లక్షల 53 వేల మందికి గృహజ్యోతి కింద మార్చి 1 నుండి ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఉచిత గ్యాస్, గృహజ్యోతి పథకాలతో పేదవారికి వేయి రూపాయలు మిగిల్చామని తెలిపారు.
.
పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మార్చి 11న ప్రారంభిస్తున్నామని మంత్రి వెల్లడించారు. మామిళ్ళగూడెంలో 50 ఎకరాల్లో రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టబోతున్నామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబం ఏనాడూ పేద ప్రజల గురించి అలోచించలేదని విమర్శించారు. ఐదేళ్లు ప్రతిపక్షంగా ఉండి తమను చూసైనా నేర్చుకోవాలని హితవు పలికారు.