- మహిళా సంఘాల బలోపేతానికి కృషి
- రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్గొండలోని కలెక్టరేట్లో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన మహిళాశక్తి క్యాంటీన్ ను మంత్రి ప్రారంభించారు. పట్టణంలోని బీట్ మార్కెట్లో 33/11 కేవీ సబ్ స్టేషన్, ఫుడ్ స్ట్రీట్, బీటీఎస్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం, నల్గొండ మున్సిపాలిటీలో నూతన కౌన్సిల్ హాల్, గవర్నమెంట్ ఆస్పత్రిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే వారి కుటుంబాలు బాగుపడుతాయన్నారు. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా మహిళాశక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కలెక్టరేట్ పక్కనే రూ.36 కోట్లతో అదనపు బ్లాక్ లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రానున్న వేసవిలో నల్గొండలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ప్రత్యామ్నాయ ఫీడర్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు.
నేడు నల్గొండ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ విడుదల చేస్తాం..
గణతంత్ర దినోత్సవ సందర్భంగా నల్గొండ మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ ను ఆదివారం హైదరాబాద్లో విడుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. నల్గొండలో నిర్వహించిన మున్సిపాలిటీ పాలకవర్గం చివరి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసే మాస్టర్ ప్లాన్ తో నల్గొండను సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమృత్ స్క్రీన్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 53 కిలోమీటర్లు పూర్తయ్యాయని, డిసెంబర్ నాటికి మొత్తం పూర్తి చేస్తామన్నారు.
లతీఫ్ సాహెబ్ గుట్ట, కాపురాల గుట్టకు సిమెంట్ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. రూ.100 కోట్లతో ముషంపల్లి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తికి రూ.3 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. రూ.500 కోట్లతో తాగునీరు, అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్పాలకవర్గ సభ్యులను మంత్రి సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.