మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  •      3 నెలల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నాం
  •     రూ.700  కోట్లతో నల్గొండ పట్టణం చుట్టూ బైపాస్​ రోడ్డు నిర్మిస్తాం 
  •     ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తాం 
  •     రాష్ట్ర రోడ్లు,  భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని, మహిళా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ సమీపంలోని ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వరాలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నల్గొండ పట్టణంతోపాటు తిప్పర్తి, కనగల్​ మండలాల్లో  వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మహేశ్వరుడిని కోరుకున్నట్లు తెలిపారు.

భారతదేశంలోనే ఆధ్యాత్మికంగా, ఆర్కియాలజీ పరంగా ప్రత్యేకమైన దేవాలయాలు నల్గొండలో జిల్లాలో ఉన్నాయన్నారు. ఛాయా సోమేశ్వరాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆర్కియాలజీ నిపుణులు వచ్చి పరిశీలించారన్నారు. వచ్చే ఏడాది శివరాత్రి నాటికి  ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. శివరాత్రి పర్వదినం రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజంలోని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వం కల్పించిందన్నారు. మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించి ఆలయాలను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఈనెల 11న త్వరలోనే భద్రాద్రి రామయ్య పాదాల దగ్గర మహిళల పేరు మీద సీఎం రేవంత్​రెడ్డి ఇందిరమ్మ  ఇండ్లు మంజూరు చేయబోతున్నారని చెప్పారు.   నల్గొండ పట్టణంలో రూ.326 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.

నల్గొండ చుట్టూ రూ.700 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి వచ్చే నెలలో టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. ముషంపల్లి డబల్ రోడ్డు కు  ఇప్పటికే రూ.90 కోట్లు కేటాయించామన్నారు. . కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని  రమేశ్​గౌడ్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఆలయ చైర్మన్​ గంట్ల అనంతరెడ్డి,  కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరీమోహన్ బాబు, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, 
పాల్గొన్నారు.

నిరుపేదలకు త్వరలో ఇందిరమ్మ ఇళ్లు 

హాలియా : నిరుపేదలకు త్వరలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కేంద్రంలో నల్గొండ దేవరకొండ రోడ్డు పీరియాడిక్ రెన్యువల్ పనులకు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. నల్గొండ ఎంపీ గా కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో  గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో ఎస్సీ రాజేశ్వర్ రెడ్డి, ఈఈ ఖాజన్ గౌడ్, ఏఈ గణేశ్​కుమార్, ఏఈఈ అనిత,  జిల్లా నాయకులు కంచర్ల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ గాలి రవి కుమార్, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు తగుల్ల సర్వయ్య, మాజీ ఎంపీపీ చనమల్ల జగదీశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ కుప్ప రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీశ్వర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు జాల సత్తయ్య, యూత్ అధ్యక్షుడు కమతం జగదీష్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేడి వెంకన్న,  ఓబీసీ అధ్యక్షుడు కొత్త నాగరాజు తదితరులు పాల్గొన్నారు.