మానసిక ఒత్తిళ్ల వల్లే ఎక్కువగా సూసైడ్స్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మానసిక ఒత్తిళ్ల వల్లే ఎక్కువగా సూసైడ్స్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: సమాజంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్లు, యాంత్రిక జీవనానికి పరిష్కారం చూపించేవి కల్చరల్ సెంటర్సేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‎ జూబ్లీహిల్స్‎లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నూతనంగా నిర్మించిన కల్చరల్ సెంటర్‎ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 3 ఎకరాల్లోనే ఇంతటి అద్భుతమైన కల్చరల్ సెంటర్ భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజంలో చిన్న కుటుంబాలు పెరిగాక ఆత్మహత్యల శాతం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న రంగనాథ్ ఆత్మహత్య ఇందుకు ప్రధాన ఉదాహరణ అని అన్నారు. ఆయనకు జీవితాంతం బ్రతకడానికి సరిపడేంత డబ్బుంది.. ఆస్తులున్నాయి.. పిల్లలు విదేశాల్లో ఉన్నారు.. కానీ ఆయన బాగోగులు చూసుకునేవారు లేక ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు.  ఒంటరితనం వల్ల ఇబ్బందులు పడుతున్న పెద్ద వయసువారికి ఇలాంటి కల్చరల్ సెంటర్స్ ఒక మార్గం చూపించాలని ఆయన ఆకాంక్షించారు. నూతనంగా నిర్మించిన ఈ కల్చరల్ సెంటర్‎కు సంబంధించి ప్రభుత్వం తరఫున ఏదైనా మౌళిక సదుపాయల కల్పనకు అవసరం ఉంటే అధికారులతో మాట్లాడి సహయం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి.