నల్గొండ అర్బన్(తిప్పర్తి), వెలుగు : సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కాలుష్యాన్ని అరికట్టడంతోపాటు వర్షాలు అధికంగా కురిసేందుకు మొక్కలు దోహదపడుతాయని తెలిపారు. అడవులు ఉన్నచోటనే వర్షాలు ఎక్కువగా కురుస్తాయని చెప్పారు.
మొక్కలు నాటే బాధ్యత ప్రభుత్వానిది మాత్రమే కాదని, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులందరిపై ఉందన్నారు. రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని చెప్పారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 66 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడంతోపాటు నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ టి.పూర్ణచంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, డీఆర్డీవో నాగిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ భూమయ్య, ఆర్డీవో రవి, డీఎస్పీ శివరామిరెడ్డి, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.