కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రజాభవన్ ద్వారా ప్రజాపాలన నిర్వహిస్తున్నామని.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వంద రోజులల్లో అన్ని పథకాలను అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లాలోని ఆయన నివాసంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
మా ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి పండుగ సంక్రాంతి సందర్భంగా.. రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సిలిండర్లు సబ్సిడీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తున్నామని చెప్పారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 10 కోట్ల రూపాయలతో హాస్టల్ నిర్మాణం, నల్లగొండ, ముషంపల్లి, కన్నేకల్ మీదుగా తిప్పర్తి వెళ్లేలా రూ.100 కోట్ల రోడ్డు పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. గుండ్లపల్లి నుండి రేగట్ట వరకు రూ.30 కోట్లతో డబుల్ రోడ్డు పనులు ప్రారంభించామని.. త్వరలో ధర్వేశిపురం వయా దోరేపల్లి, పగిడిమర్రి వరకు రోడ్డు పనులను రూ.34 కోట్లతో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలను అందరూ ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు.యాదాద్రి థర్మల్ పవర్ పాయింట్ ప్రాజెక్టుపై ఎంక్వయిరీ జరుగుతుందని.. తప్పు జరిగినట్లు తేలితే ఎవ్వరినీ వదిలి పెట్టమని.. కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నల్లగొండలో డ్రైనేజీ, మిగిలిపోయిన రోడ్లు, ఇటీవల మున్సిపాలిటీలో విలీనం చేసిన చర్లపల్లి, మర్రిగూడెం, అర్జాల బావిలో అన్నీ పనులు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.