నల్గొండ, వెలుగు: ఆగస్టు 15 నాటికి రైతుల రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి కోమటిరె డ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఒకవేళ చేయలేకపోతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ప్రజల ముందుకు రామన్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతుగా బుధవారం నల్గొండలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అబద్ధాల అగ్గిపెట్టె రావు(హరీశ్ రావు) దొంగ రాజీనామాలతో మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు.
ఆనాడు ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోలు పోసుకుంటే అక్కడ వెయ్యి మంది ఉన్నా.. హరీశ్ రావుకు అగ్గిపెట్టె దొరకలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని, రాజీనామా లేఖ ఎలా రాయాలో తనను అడిగితే చెప్తానన్నారు. 12 సీట్లు గెలిస్తే మా అయ్య ఢిల్లీలో చక్రం తిప్పుతాడని కేటీఆర్ చెప్తున్నాడని.. కానీ, బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని విమర్శించారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో రఘువీర్ రెడ్డి గెలువబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు.
‘స్థానిక’ అభ్యర్థుల ఖర్చు భరిస్తా
లోక్‌సభ ఎన్నికల్లో కష్టపడ్డ పార్టీ కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు ఇస్తామని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా, ఆ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కూడా తానే భరిస్తానని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు నల్గొండ నియోజకవర్గంలో ఏపీ తరహాలో వలంటీర్ వ్యవస్థను అమలు చేస్తానన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వలంటీర్లకు గ్రామ స్థాయిలో రూ.5 వేలు, మండల స్థాయిలో రూ.10 వేలు అందిస్తామని చెప్పారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి రఘువీర్‌ను గెలిపించాలని కోరారు.